నవ భారత నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలతో భారత్ ముందుకెళ్తోందన్నారు.
భారత్-ఫ్రాన్స్ మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు ప్రధాని. సౌర, అంతరిక్ష, డిజిటల్, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలపడిందన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ.
" భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం ధృడమైనది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఈనాటివి కావు. మంచి స్నేహం అంటే కష్ట, నష్టాల్లో సహకరించుకోవటం, ఇక్కడ అదే జరిగింది. నవ భారతంలోని సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే గర్వకారణం. దేశంలో సులభతర వాణిజ్యం, జీవన విధానం అమలుకు కృషి చేస్తున్నాం. భారత్‌లో గత ఐదేళ్లలో ఎంతో సానుకూల మార్పు వచ్చింది. ఈ మార్పులో యువశక్తి, గ్రామాలు, పేదలు, రైతులు, నారీశక్తి కేంద్ర బిందువులుగా మారాయి. నేను ఫుట్‌బాల్ ప్రేమికుల దేశానికి వచ్చాను. ఫుట్‌బాల్ అభిమానులకు తెలుసు.. తుది లక్ష్యం గోల్ చేయటమేనని. గోల్‌శక్తి ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు. గతంలో అసాధ్యమనుకున్న లక్ష్యాలను మేం ఐదేళ్లలో సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. "
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి