"ఓ" బ్లడ్ గ్రూప్ ఉన్న వారు కరోనా బారినపడే అవకాశం తక్కువని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఒకవేళ వీరికి కరోనా సోకినా.. ఇతరులతో పోల్చితే తీవ్రత కూడా తక్కువేనని అధ్యయనాలు స్పష్టం చేశాయి.
బ్లడ్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఈ రెండు అధ్యయనాలు ప్రచురితమయ్యాయి. దీనితో బ్లడ్ గ్రూప్‌నకు, కరోనా బారినపడే అవకాశాలకు సంబంధం ఉందనేందుకు మరిన్ని ఆధారాలు లభించినట్టు అయ్యింది.
వారిలో ఎక్కువే...
తొలి అధ్యయనంలో.. డెన్మార్క్‌లో కరోనా సోకిన దాదాపు 4,70,000మంది హెల్త్ రిజిస్ట్రీ డేటాను.. 22లక్షల మంది సాధారణ జనాభా డేటాతో పోల్చి చూశారు పరిశోధకులు. కరోనా బారినపడ్డ వారిలో 'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తక్కువగా ఉన్నట్టు.. ఏ,బీ,ఏబీ గ్రూప్‌ల వారు అధికంగా ఉన్నట్టు గుర్తించారు.