తెలంగాణ

telangana

ETV Bharat / international

'మహమ్మారి ముగింపుపై కలలు కనొచ్చు' - కొవిడ్​-19

కరోనాను అరికట్టేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్​లు సత్ఫలితాలు ఇస్తున్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ (​డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. కరోనా ముగింపుపై కలలు కనొచ్చని తీపు కబురు అందించింది.

people can dream of pandemic end WHO chief
'మహమ్మారి ముగింపుపై కలలు కనొచ్చు'

By

Published : Dec 5, 2020, 11:07 AM IST

ప్రపంచం ఇక మహమ్మారి విపత్కాలం ముగింపుపై కలలు కనే సమయం ఆసన్నమైందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ల సానుకూల ఫలితాల నేపథ్యంలోనే సంస్థ ఈ ప్రకటన చేసింది. వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం అప్రమత్తత, జాగ్రత్తతో ఉండాలంటూ హెచ్చరిస్తూ వచ్చిన డబ్ల్యూహెచ్‌వో.. సుదీర్ఘకాలం తర్వాత సానుకూల ప్రకటన చేయడం విశేషం. ఎన్ని ఔషధాలు, వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని పలు అధ్యయనాలు పేర్కొన్నా.. డబ్ల్యూహెచ్‌వో మాత్రం కరోనా కాలం ఇంకా సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన యావత్తు ప్రపంచానికి ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి! అయితే, వ్యాక్సిన్‌ విషయంలో పేద, మధ్యాదాయ దేశాలపై ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శించరాదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అభిప్రాయపడ్డారు.

కరోనా అంతానికి సమయం దగ్గరపడ్డప్పటికీ.. ఆ దిశగా వెళుతున్న మార్గమే కొంత అనుమానాస్పదంగా ఉందన్నారు. పరోక్షంగా పేద దేశాలకు టీకా అందుబాటులోకి రావడంపై ఉన్న సందేహాలను వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి కాలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచితో పాటు చెడునూ వెలుగులోకి తెచ్చిందన్నారు. ఈ కష్టకాలంలో ప్రజల నిబద్ధత, త్యాగం, శాస్త్ర విజ్ఞాన శక్తి, మనసుల్ని కలచివేసిన సంఘీభావాలు అందరికీ స్ఫూర్తిగా నిలిస్తే.. స్వార్థం, విభజన, పరస్పర నిందారోపణలు కలచివేశాయన్నారు. మహమ్మారిపై ఐరాస సాధారణ సభ నిర్వహించిన తొలి ఉన్నతస్థాయి సమావేశంలో అధనామ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

"పేదరికం, ఆకలి, అసమానత, పర్యావరణ మార్పుల వంటి శాశ్వత సమస్యలకు ఎలాంటి వ్యాక్సిన్‌ పరిష్కారం చూపలేదు. మహమ్మారి కాలం ముగియగానే ప్రతిదేశం ఈ సవాళ్లపై దృష్టి సారించాలి. ఉత్పత్తి, వినియోగం విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఏకచ్ఛత్రాధిపత్యం, ప్రకృతి సమతుల్యతను కాపాడడం పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి, బెదిరింపులు, అనవసరపు జోక్యాలు, విభజన రాజకీయాలవైపు తిరిగి అడుగులు వేయరాదు."

--డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌

వ్యాక్సిన్‌ను ప్రవేట్‌ వినియోగ వస్తువుగా చూడరాదని.. అందరికీ అందుబాటులోకి వచ్చేలా పంపిణీ వ్యవస్థ ఉండాలని టెడ్రోస్‌ సూచించారు. టీకా పంపిణీ కోసం డబ్ల్యూహెచ్‌వో ఏసీటీ-ఆక్సిలరేటర్‌ కార్యక్రమానికి మరికొన్ని నిధులు అవసరమని.. లేదంటే ఓ ఉన్నత లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణం 4.3 బిలియన్‌ డాలర్లు అవసరం ఉండగా 2021లో మరో 23.9 బిలియన్‌ డాలర్లు అవసరమని తెలిపారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత జీ20 దేశాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో ఈ మొత్తం కేవలం 0.005 శాతమేనని తెలిపారు.

ఇదీ చదవండి:'24 గంటల్లోనే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట'

ABOUT THE AUTHOR

...view details