kherson city people problems: ఇంట్లో ఉండటం, బాంబుల మోత వినిపించగానే సెల్లార్‌లోకి పరుగెత్తడం, మళ్లీ పైకి రావడం ఇలా అనుక్షణం భయంతో బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నాం. నాకు పెళ్లయి నెలన్నరైంది. భర్త రాజధాని కీవ్‌లో ఉన్నారు. నేనేమో ఫిబ్రవరి 24న పుట్టినరోజు అని అమ్మ దగ్గరకు వచ్చా. మరుసటి రోజే దాడి మొదలైంది. బయటకు కదలలేని పరిస్థితని ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ పట్టణానికి చెందిన యులియా అనే యువతి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి భయానక పరిస్థితుల గురించి ఆమె 'ఈనాడు'తో మాట్లాడారు.
'అనుక్షణం భయంతో.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం' - రష్యా సైనికులు
kherson city people problems: ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొెంటున్నారు. బయటకు కదలలేని పరిస్థితుల్లో ఉన్నామని ఉక్రెయిన్‌కు చెందిన యులియా అనే యువతి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి భయానక పరిస్థితుల గురించి ఆమె 'ఈనాడు'తో మాట్లాడారు.
"నేను ఖేర్సన్‌లో పుట్టి పెరిగా. ప్రస్తుతం కీవ్‌లోని సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నా. భర్త ఆగ్రోట్రేడింగ్ కంపెనీలో ఉద్యోగి. పుట్టినరోజుకోసమని ఖేర్సన్‌కు వచ్చా. రష్యన్ సైన్యం బాంబులు, రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడింది. 46 మంది పౌరులు చనిపోయారు. పట్టణం పూర్తిగా వారి ఆధీనంలో ఉంది. జెండా మాత్రం ఉక్రెయిన్‌దే ఎగురుతుంది. ఈ రోజు(శుక్రవారం) బయటకు వెళ్లి ఏమైనా తెచ్చుకోవడానికి అనుమతించారు. అయితే షాపుల్లో ఏమీ లేవు. ఇంట్లో కిటికీలన్నీ తెరిచి పడుకొంటాం. కానీ నిద్రపోం. బాంబుదాడులు, తుపాకీ మోతలు వినిపించగానే పరుగెత్తుకుంటూ సెల్లార్‌లోకి వెళ్తాం. పురాతన ఇళ్లలోనే ఇవి ఉన్నాయి. మా పక్కింటి వాళ్లు రష్యన్ మాట్లాడతారు. వాళ్లకు సెల్లార్ లేకపోవడంతో మాతోనే ఉంటున్నారు. ఇక్కడ ఇళ్లు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. ఏ మాత్రం పోరు జరిగినా పౌరనష్టం ఎక్కువగా ఉంటుంది. ఆహార సరఫరాకు రష్యన్లు ప్రయత్నించగా స్థానికులు తిరస్కరించారు. వాళ్లే కొందరిని ఎంపిక చేసుకొని పొట్లాలిచ్చి చిత్రీకరించి సాయం చేసినట్లు చెప్పుకొంటున్నారు. ఉక్రెనియన్లు తీసుకొచ్చిన ఆహారం, నిత్యావసరాలను రష్యా సైన్యం అనుమతించడంలేదు. నీళ్లు, గ్యాస్, విద్యుత్తు సరఫరా ఇలా అన్నీ సమస్యగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక మానసిక ఆందోళనతోనే ఎక్కువ సమస్యలు ఎదుర్కొనేలా ఉన్నాం" అని యులియా తెలిపారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్- రష్యా మధ్య మూడో దఫా చర్చలు