ప్రపంచ దేశాలు బుధవారం క్రిస్మస్ సంబరాల్లో మునిగితేలాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చర్చిల్లో ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. మిఠాయిలు పంచుకున్నారు. ఆయా దేశాల్లో క్రైస్తవ ఆధ్యాత్మిక పెద్దలు శాంతి సందేశాలు అందించారు. అయితే.. ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ దేశాల్లో క్రిస్మస్ సందడి కనిపించలేదు. తుపాను ధాటికి ఫిలిప్పీన్స్ జనజీవనం అతలాకుతలమైంది. ఫ్రాన్స్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం..
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. ప్రచండగాలులతో కురుస్తున్న వర్షాలకు భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో క్రిస్మస్ వాతావరణం కనిపించలేదు.
ఆందోళనతో ఫ్రాన్స్..
ఫ్రాన్స్‌లో ఈ ఏడాది చాలా మంది క్రిస్మస్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం పింఛను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలకు వ్యతిరేకంగా చేస్తోన్న సమ్మె నాలుగో వారానికి చేరుకుంది. ఈ కారణంగా చాలా మంది ప్రజలు.. కుటుంబం, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలన్న ప్రణాళికలు వ్యర్థమయ్యాయి.