తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో లాక్​డౌన్​- బ్రిటన్​లో ఆంక్షల సడలింపు - బ్రిటన్​ అప్డేట్స్​

పాకిస్థాన్​లో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున పాక్షిక లాక్​డౌన్​ విధించింది అక్కడి ప్రభుత్వం. వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న ఇస్లామాబాద్​ సహా.. మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు.. బ్రిటన్​లో లాక్​డౌన్​ ఆంక్షల్ని సడలిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రకటించారు.

Pakistan imposes partial coronavirus lockdowns
పాక్​లో లాక్​డౌన్​- బ్రిటన్​లో ఆంక్షల సడలింపు

By

Published : Mar 29, 2021, 8:17 PM IST

పాకిస్థాన్​లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో..​ పాక్షిక లాక్​డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఇస్లామాబాద్ సహా..​ వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆ దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 11శాతానికి చేరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఇమ్రాన్​ సర్కార్​. తూర్పు పంజాబ్​ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఏప్రిల్​ 1 నుంచి ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్థానిక అధికారులు వెల్లడించారు.

దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటివరకు లాక్​డౌన్​కు దూరంగా ఉంది ఇమ్రాన్​ ప్రభుత్వం. అయితే.. ఇటీవల కరోనా విజృంభిస్తుండటం వల్ల ఆంక్షలు విధించక తప్పలేదు.

పాక్​లో కొత్తగా 4,525 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 6.59 లక్షలకు చేరింది. మరో 41 మంది కొవిడ్​కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 14,256కు పెరిగింది.

ఇదీ చదవండి:భారత్​-పాక్​ స్నేహగీతంపై చైనా హర్షం!

బ్రిటన్​లో ఆంక్షల సడలింపు..

బ్రిటన్​లో విధించిన తొలిదశ కరోనా లాక్​డౌన్​ ఆంక్షల్ని సడలిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​ తెలిపారు. ఈ క్రమంలో మనం మరో దశకు చేరుకున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆంక్షల సడలింపుతో ఇకపై ప్రజలు స్వేచ్ఛగా ఆటలాడుకోవచ్చన్న జాన్సన్​.. ఈ వేసవి కాలం గొప్ప క్రీడాకాలం అవుతుందని చెప్పారు. అయితే.. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు (వర్క్​ ఫ్రమ్​ హోం) యథాతథంగా కొనసాగించాలన్నారు. వైరస్​ నియంత్రణకు అవసరమైన చర్యలను తప్పనిసరిగా చేపట్టాలని ఆయన సూచించారు.

"ఇంగ్లాండ్​లో ఆంక్షల సడలింపుతో నేడు మనం మరో దశకు చేరుకున్నాం. దయచేసి కొత్త నియమాల్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించండి. తద్వారా మనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవచ్చు."

- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

లాక్​డౌన్ సడలింపు వల్ల ప్రజలు ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన తమ ఆనందాన్ని తిరిగిపొందవచ్చు అని జాన్సన్​ అన్నారు. ఫలితంగా.. అన్ని వయసుల వారు తమ జట్టు సభ్యులను మళ్లీ కలుసుకుని, కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:నీటిలోకి 'ఎవర్​ గివెన్​' ముందు భాగం!

ABOUT THE AUTHOR

...view details