యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించగల టీకా ఈ ఏడాది అక్టోబరు కల్లా అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదర్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో వచ్చే నెల్లో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పూనావాలా బుధవారం మాట్లాడారు.
అక్టోబరు-నవంబరు కల్లా కరోనా టీకా సిద్ధమయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకా ‘కొవిషీల్డ్’ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలను ఇచ్చినట్లు తెలిపారు. కొవిషీల్డ్ ఫొటోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక పరిమాణంలో టీకాలను ఉత్పత్తి చేసే సంస్థ ఎస్‌ఐఐ. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకాను ఉత్పత్తి చేసేందుకుగాను బయోఫార్మాసూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికాతో ఈ సంస్థ జట్టు కట్టిన సంగతి గమనార్హం. దేశీయంగా భారత్ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కొవాక్జిన్’ను మానవులపై ప్రయోగించేందుకు భువనేశ్వర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్‌యూఎంలో స్క్రీనింగ్ ప్రారంభమయినట్లు ఒక అధికారి వెల్లడించారు.