ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19కు సరైన టీకాను అందించే దిశగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముందడుగు వేశారు. వీరు రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ నుంచి 'రెట్టింపు రక్షణ' లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ ప్రయోగాల్లో తేలింది. ఈ ప్రయోగాత్మక టీకాను పొందిన వాలంటీర్ల నుంచి రక్త నమూనాలను ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. యాంటీ బాడీలతోపాటు వైరస్ హంతక 'టి కణాల'ను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్లు ఈ నమూనాలు చెబుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
"ఇది చాలా కీలకాంశం. ఎందుకంటే యాంటీబాడీలు కొద్ది నెలల్లోనే సమసిపోతాయని, టి కణాలు మాత్రం ఏళ్ల తరబడి రక్తంలో ఉంటాయని విడిగా చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది.
పరీక్ష ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆక్స్‌ఫర్డ్ టీకా.. కరోనా నుంచి సుదీర్ఘకాలం రక్షణ కల్పిస్తుందని ఇంకా రుజువు కాలేదు. అయితే ఇది టి కణాలను, యాంటీబాడీ ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడం వల్ల ప్రజలకు వైరస్ నుంచి మరింత రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉంది" అని వివరించాయి. ఆక్స్‌ఫర్డ్ టీకా అభివృద్ధి ప్రక్రియ సరైన దిశలో సాగుతుందని బెర్క్‌షైర్ పరిశోధక నైతిక విలువల కమిటీ ఛైర్మన్ డేవిడ్ కార్పెంటర్ చెప్పారు. ఈ వ్యాక్సిన్‌పై ప్రయోగాలకు అనుమతించింది ఈ కమిటీయే.