కొవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాలు మళ్లీ మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో వేయించుకున్న ఓ వాలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ప్రయోగాలు నిలిచిపోయాయి. బ్రిటీష్ రెగ్యులేటర్స్ నుంచి అన్ని అనుమతులూ రావడం వల్ల తిరిగి ప్రయోగాలు బ్రిటన్‌లో తిరిగి ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటనలో తెలిపింది.
వాలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బుధవారం ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. దీంతో ఈ వ్యాక్సిన్ భద్రతను సమీక్షించేందుకు ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటైంది. దర్యాప్తు చేసిన ఈ కమిటీ వ్యాక్సిన్ భద్రమేనని, ప్రయోగాలు ప్రారంభించొచ్చని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఏ)కి సిఫార్సు చేసింది. దీంతో ఎంహెచ్‌ఆర్‌ఏ నుంచి అనుమతులు రావడంతో ప్రయోగాలను తిరిగి ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.