ఆక్స్ఫర్డ్ టీకా వినియోగానికి బ్రిటన్ ఔషధ, ఆరోగ్య నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) ఈ నెలాఖర్లో అనుమతి ఇస్తుందని అక్కడి వార్తా సంస్థ 'ది డైలీ టెలిగ్రాఫ్' కథనం ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ సురక్షితం, ప్రభావవంతంగా పని చేస్తోందని తేలిన తర్వాత ఫలితాలను విశ్లేషించి అనుమతులు మంజూరు చేసే బాధ్యతను స్వతంత్ర సంస్థ ఎంహెచ్ఆర్ఐకు గత నెలలో ఇచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. తుది ఫలితాలను సోమవారం పొందిన తర్వాత డిసెంబర్ 28 లేదా 29న ఆక్స్ఫర్డ్ టీకా వినియోగానికి అనుమతిస్తామని ఎంహెచ్ఆర్ఏ అధికారిక వర్గాలు తెలిపినట్లు 'ది డైలీ టెలిగ్రాఫ్' పేర్కొంది.
ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకాకు బ్రిటన్లో అనుమతి లభిస్తే ప్రపంచ దేశాలకు దీనిపై నమ్మకం ఏర్పడుతుందని, భారత్లో ఇప్పటికే 5 కోట్లకుపైగా ఈ టీకా డోసులు సిద్ధమయ్యామని వార్తా సంస్థ వివరించింది. భారత్లో ఆక్స్ఫర్డ్ టీకా ఉత్పత్తిని సీరం సంస్థ నిర్వహిస్తోంది.