కరోనా వైరస్‌ను అత్యంత వేగంగా గుర్తించగలిగే సాంకేతికతను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఐదు నిమిషాల్లోనే వైరస్‌ను నిర్ధరించే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టును రూపొందించినట్లు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్ట్, వాణిజ్య కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో.. అధిక సంఖ్యలో కొవిడ్ పరీక్షలు చేసేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
అయితే.. ఈ పరికరాన్ని 2021 ప్రారంభంలో తయారు చేస్తామన్నారు ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు. ఆమోదం అనంతరం ఆర్నెల్ల తర్వాత విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. అత్యంత తేలికగా.. వేగంగా.. తక్కువ ఖర్చుతో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయవచ్చని ఆక్స్‌ఫర్డ్‌లో భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ అచిల్లెస్ కపనిడీస్ స్పష్టంచేశారు.
ర్యాపిడ్ టెస్ట్‌లే కీలకం..
వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు ఎంతో కీలకమయ్యాయి. ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్ విధానంలో కచ్చితంగా గుర్తిస్తున్నప్పటికీ, పరీక్షలకు సమయంతోపాటు ఖర్చుకూడా ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేసే కొన్ని పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. వీటిలో కరోనా వైరస్‌ను గుర్తించే కచ్చితత్వంలో తేడాలున్నాయి. దీంతో అత్యంత వేగంగా, కచ్చితమైన ఫలితమిచ్చే ర్యాపిడ్ టెస్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వైరస్‌తో సహజీవనం తప్పదని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ను వేగంగా గుర్తించడంలో ర్యాపిడ్ టెస్టులు ఎంతో కీలకం కానున్నాయని అభిప్రాయపడ్డారు నిపుణులు.
భారత్-ఇజ్రాయెల్‌లు సమన్వయంతో..
కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి పనిచేస్తున్నాయి. భారత్‌లోని డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌తో ఇజ్రాయెల్ రక్షణశాఖకు చెందిన డీఆర్‌డీడీ కలిసి సంయుక్తంగా ర్యాపిడ్ టెస్టింగ్ పరిశోధన చేపట్టాయి. మరికొన్ని వారాల్లోనే ఈ పరీక్షలకు సంబంధించి ప్రయోగ ఫలితాలు వెలువడనున్నాయి. దీనిపై ఇజ్రాయిల్ విదేశాంగశాఖ ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది.
ఇదీ చదవండి:'భారత్‌లో 9కోట్ల మందికి ఆ సౌకర్యాలు లేవు'