వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాల్లో ఎలాంటి ఫలితాలు రాకపోయే అవకాశాలు 50 శాతంగా ఉందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ సంక్రమణ రేటు క్షీణించటమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు.
10,260 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహిస్తామని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గతవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫలితాల అంచనాపై స్పష్టతనిచ్చారు పరిశోధకులు.
వాలంటీర్లలో ఇన్పెక్షన్ల సంఖ్యతో వ్యాక్సిన్ తీసుకున్న బృందంలోని ఇన్ఫెక్షన్ల సంఖ్యను పోల్చి కరోనాను ఈ టీకా నియంత్రించగలదో లేదో అన్న విషయాన్ని నిర్ధరిస్తామని తెలిపారు. ఇందుకోసం కొంతమంది వలంటీర్లకు కరోనా వైరస్ సంక్రమించి ఉండాలని వెల్లడించారు.
"అవసరమైన సంఖ్యను మనం ఎంత త్వరగా చేరుకుంటాం అనేది సమాజంలో వైరస్ సంక్రమణపై ఆధారపడి ఉంటుంది. సంక్రమణ అధికంగా ఉంటే రెండు నెలల్లో టీకా పనిచేస్తుందో లేదో తెలుసుకోవటానికి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. వ్యాప్తి క్షీణిస్తే ఇందుకు 6 నెలల వరకు పట్టవచ్చు."
- ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్, జెన్నర్ ఇనిస్టిట్యూట్