కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. లండన్లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ల కొత్త వ్యాక్సిన్ను ఆరువారాల్లోనే అభివృద్ధి చేసి పరీక్షించవచ్చని బ్రిటన్ మీడియా వెల్లడించడం సరికొత్త ఆశలు రేపుతోంది. దీని వల్ల కరోనాపై పోరులో సమూల మార్పులు వస్తాయని బ్రిటన్ మీడియా పేర్కొంది.
కరోనా మహమ్మారి కారణంగా బ్రిటన్ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. శీతాకాలంలో వైరస్ మరోసారి విజృంభిస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళనతో ఉంది. పాఠశాలలు తిరిగి తెరిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఆశాజనకంగా ఉన్నట్లు బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ ప్రధాన అధికారి కేట్ బింగ్హామ్ చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి పనులను కొనసాగిస్తూ ఉండాలని, ఇప్పుడే వేడుకలు జరుపుకోవడం తగదన్నారు.