తెలంగాణ

telangana

ETV Bharat / international

'వ్యాక్సిన్​ వస్తేనే కరోనా కష్టాల నుంచి విముక్తి'

సురక్షితమైన వ్యాక్సిన్ ఒక్కటే ప్రపంచాన్ని కరోనా నుంచి కాపాడుతుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ ఉద్ఘాటించారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ టీకాను కనుగొంటే.. లక్షలాది మంది జీవితాలను కాపాడటం సహా లక్షల కోట్ల ధనాన్ని ఆదా చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Only a COVID-19 vaccine will allow return to 'normalcy': UN chief
'వ్యాక్సిన్​ వస్తేనే కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి'

By

Published : Apr 16, 2020, 11:45 AM IST

కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచానికి సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్​తోనే విముక్తి లభిస్తుందని అభిప్రాయపడ్డారు ఐరాస ప్రధాన కార్యదర్శి​ ఆంటోనియో గుటెరస్​. ఈ ఏడాది చివరినాటికి వైరస్​ను నిర్మూలించే టీకాను కనిపెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. సుమారు 50 ఆఫ్రికన్​ దేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ వ్యాఖ్యలు చేశారు గుటెరస్​.

వ్యాక్సిన్​ను సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి చేసి, అందరికీ అందుబాటులో ఉంచాలని గుటెరస్​ పిలుపునిచ్చారు. ఫలితంగా లక్షలాది మంది జీవితాలతో పాటు లక్షల కోట్ల ధనాన్ని ఆదా చేయొచ్చని తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి మార్చి 25న 2 బిలియన్ డాలర్ల విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. అందులో 20 శాతం సేకరించినట్లు ఆంటోనియో వెల్లడించారు.

ఆ దేశాలకు ప్రశంసలు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా 47 ఆఫ్రికన్​ దేశాల్లో కరోనా పరీక్షల నిర్వహణకు ఐరాస కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు గుటెరస్. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఆఫ్రికన్​ దేశాలు చేపట్టిన ప్రయత్నాలను ప్రశంసించారు.

గేట్స్​ ఫౌండేషన్ మరో అడుగు...

700 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లను సిద్ధం చేసేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరింది బిల్​ అండ్​ మెలిందా గేట్స్​ ఫౌండేషన్. వ్యాక్సిన్, కరోనా చికిత్సా విధానాల అభివృద్ధి కోసం తమ వంతుగా మరో 150 మిలియన్ల డాలర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది.

సురక్షితమైన కరోనా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసి, పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు 18 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. అన్ని దేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు టీకా తయారీ ప్రణాళికలను తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఫౌండేషన్​ సారథి మార్క్​ సుజ్మాన్.

వైరస్​పై పోరాడేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో 100 మిలియన్ల డాలర్లను ప్రకటించింది ఈ సంస్థ. ఆ మొత్తానికి తాజాగా మరో 150 మిలియన్ల డాలర్లు జోడించింది.

ABOUT THE AUTHOR

...view details