కరోనా వ్యాక్యిన్ను తీసుకోవడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు విముఖంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని వారిలో ఉన్న భయమే ఇందుకు కారణమని పేర్కొంది.
జులై 24 నుంచి ఆగస్టు 7 మధ్యకాలంలో.. 27 దేశాల్లోని 20వేల మందిపై వరల్డ్ ఎకనామిక్ ఫారం-ఐపీఎస్ఓఎస్ ఈ సర్వే నిర్వహించింది. అయితే.. ఈ ఏడాదే వ్యాక్సిన్ వస్తుందని విశ్వసిస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. చైనా, సౌదీ అరేబియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
అందుబాటులోకి వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్‌ను కచ్చితంగా తీసుకుంటామని.. ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న 74శాతం మంది తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారిలో చైనా(97శాతం) ముందువరుసలో ఉంది. బ్రెజిల్(88శాతం), ఆస్ట్రేలియా(88శాతం), భారత్(87శాతం).. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని పట్టించుకోని దేశాల్లో రష్యా(54శాతం), పోలాండ్(56శాతం), హంగేరీ(56శాతం), ఫ్రాన్స్(59శాతం) ముందువరుసలో ఉన్నాయి.
అదే సమయంలో ఈ ఏడాది వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం లేదని సగానికిపైగా మంది(59శాతం) అభిప్రాయపడ్డారు. రానున్న నాలుగు నెలల్లో వైరస్‌కు వ్యాక్సిన్ వస్తుందని.. జర్మనీ, బెల్జియం, జపాన్, పోలాండ్ దేశాల్లోని ప్రతి నలుగురిలో ఒకరు- అంతకన్నా తక్కువమంది విశ్వసిస్తున్నారు.