తెలంగాణ

telangana

ETV Bharat / international

విదేశీ వలసల్లో భారత్ టాప్​: యూఎన్ - US DESA

మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో.. భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2020 నాటికి కోటీ 80 లక్షల మంది.. విదేశాల్లో నివసిస్తున్నట్లు తెలిపింది. భారత్‌ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌, సౌదీ అరేబియాకు తరలివెళ్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. విదేశాలకు తరలివెళ్తున్న భారతీయులకు ఎక్కువగా అమెరికా గమ్యస్థానంగా మారుతోంది.

A crore Indians migrated in last 20 years: UN report
విదేశీ వలసల్లో భారత్ టాప్​: యూఎన్ నివేదిక

By

Published : Jan 16, 2021, 12:06 PM IST

ప్రపంచ దేశాలకు భారత్‌ నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం 'యూఎస్​ దెస' విడుదల చేసిన "ఇంటర్నేషనల్ మైగ్రేషన్-2020 ముఖ్యాంశాలు" నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. 2020 నాటికి భారత్‌ నుంచి కోటీ 80 లక్షల మంది ప్రజలు వేరే దేశంలో నివసిస్తున్నట్లు ఐరాస నివేదిక తెలిపింది.

భారత్‌ తర్వాత మెక్సికో, రష్యా చెరో కోటీ 10 లక్షలు, చైనాలో కోటి మంది, సిరియాలో 80 లక్షల మంది.. వేరే దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్నారు. భారత్‌ నుంచి వలస వెళ్లిన వారిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 30 లక్షల మంది, అమెరికాలో 27 లక్షల మంది, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్థాన్​, ఖతార్, ఇంగ్లాండ్‌లోనూ అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

2000 నుంచి 2020 మధ్య విదేశాల్లో వలస జనాభా గణనీయంగా పెరిగిందని.. ఐరాస నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో భారత్‌ నుంచి అత్యధికంగా కోటి మంది విదేశాలకు పయనమవ్వగా తర్వాతి స్థానాల్లో సిరియా, వెనిజువెలా, చైనా, ఫిలిప్పైన్స్ ఉన్నాయి. 2020 నాటికి 5 కోట్ల మందికిపైగా వలసదారులకు అమెరికా గమ్యస్థానంగా మారింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని.. ప్రపంచంలోని మొత్తం వలసల్లో ఇది 18 శాతమని నివేదిక తెలిపింది. అమెరికా తర్వాత జర్మనీ, సౌదీ అరేబియా, రష్యా, బ్రిటన్‌.. వలసదారులకు ఎక్కువగా ఆతిథ్యమిచ్చాయి.

కరోనా నేపథ్యంలో జాతీయ సరిహద్దులను మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వలసలు తగ్గాయని నివేదిక పేర్కొంది. 2020లో 20 లక్షల వలసలు తగ్గాయని వెల్లడించింది. 2019 అంచనాల కంటే ఇది 27 శాతం తక్కువని ఐరాస నివేదిక తెలిపింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 281 మిలియన్ల మంది వేరే దేశాల్లో స్థిరపడ్డారు. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 173 మిలియన్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని ఐరాస తెలిపింది. భారత్‌, అర్మేనియా, పాకిస్థాన్, ఉక్రెయిన్, టాంజానియా దేశాలకు వలస వస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఇదీ చదవండి:దిల్లీ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా

ABOUT THE AUTHOR

...view details