Uk Lockdown: బ్రిటన్లో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఆ దేశంలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు.. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం ఈ నెల చివర్లో రెండు వారాలపాటు సడలింపులతో కూడిన లాక్డౌన్ విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి మీడియా ఆదివారం తమ కథనాల్లో తెలిపింది.
Uk omicron cases: ఇండోర్ సమావేశాలను రద్దు చేయడం సహా పబ్స్, రెస్టారెంట్లను తక్కువ సామర్థ్యంతో నిర్వహించడం వంటి ఆంక్షలను విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని 'ది టైమ్స్' తన కథనంలో తెలిపింది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. లాక్డౌన్ కాకుండా తేలికపాటి నిబంధనలను అమలు చేసే విధంగా 'ప్లాన్ సీ'ని పరిశీలిస్తున్నారని 'ఫైనాన్షియల్ టైమ్స్' తెలిపింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రులను శాస్త్రవేత్తలు హెచ్చరించారని 'బీబీసీ' చెప్పింది.