Omicron death cases: ఒమిక్రాన్ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. కొత్త రకం కరోనా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందన్న వార్తలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా.. బ్రిటన్‌లో ఓ వ్యక్తి ఒమిక్రాన్‌తో మరణించారన్న వార్త కలకలం సృష్టించింది. అయితే.. అదే బ్రిటన్‌లో ఒక్క ఒమిక్రాన్‌తోనే 75వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం అంచనా వేయడం అత్యంత ఆందోళనకర విషయం.
ఒమిక్రాన్ నేపథ్యంలో బ్రిటన్‌లో ప్రస్తుతం ఆంక్షలు విధించారు. మరిన్ని చర్యలు తీసుకోకపోతే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్‌తో 25వేల నుంచి 75వేల మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఓ మోడెలింగ్ అధ్యయనం పేర్కొంది. 2021 జనవరితో పోల్చుకుంటే.. ఒమిక్రాన్‌తో కరోనా కేసులు మరింత ఎక్కువగా బయటపడతాయని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
యాంటీబాడీల నుంచి తప్పించుకునే లక్షణాలను ఆధారంగా చేసుకుని, అందుబాటులో ఉన్న డేటాతో ఈ అధ్యయనం చేశారు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు. కొత్త వేరియంట్.. రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై ఈ పరిశోధనలు జరిగాయి.
- మరిన్ని కట్టడి చర్యలు తీసుకోకుండా, అత్యంత సానుకూల పరిణామాలను(రోగనిరోధక శక్తి దెబ్బతినకుండా ఉండి, వ్యాక్సిన్ బూస్టర్లు కచ్చితంగా పనిచేస్తే) దృష్టిలో పెట్టుకుంటే.. డిసెంబర్ 1 నుంచి 2022 ఏప్రిల్ 30 నాటికి 24,700 మరణాలు నమోదవుతాయి. రోజుకు 2వేల కేసులు బయటకొస్తాయి. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అత్యధికంగా 1,75,000గా ఉంటుంది. ఈ సమయంలో.. కొవిడ్ కట్టి చర్యలు చేపడితే.. మరణాలు 7,600కి తగ్గే అకాశముంది.
- అత్యంత దారుణమైన పరిస్థితుల్లో(వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం టీకాలకు, రోగ నిరోధక శక్తికి లేకపోతే), మరిన్ని కట్టడి చేర్యలు తీసుకోకపోతే.. 74,800 మరణాలు నమోదవుతాయి. ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య 4.92లక్షలు దాటిపోతుంది. ఇదే జరిగితే.. ప్రభుత్వం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని, లేకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు.