Omicron community transmission: ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది. ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ వైద్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 336 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 261 ఇంగ్లాండ్‌లోనే బయటపడ్డాయని చెప్పారు. స్కాట్లాండ్లో 71, వేల్స్లో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించారు.
Omicron variant news:
కొత్తగా నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఎటువంటి సంబంధం లేనివారు కూడా ఉన్నారని బ్రిటన్ ప్రతినిధుల సభకు అందించిన నివేదికలో జావిద్ పేర్కొన్నారు. దీని ద్వారా సామాజిక వ్యాప్తి ఉందని స్పష్టమవుతోందని అన్నారు.
ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు తాము ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని జావిద్ స్పష్టం చేశారు. ఈ వేరియంట్ ప్రమాదకరమా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. టీకాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేదీ స్పష్టంగా తెలీదని చెప్పారు. శాస్త్రవేత్తలు దీనిపై నిర్ధరణకు వచ్చేంత వరకు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అన్నారు.