ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగటానికి వీలు కల్పించే 8 విభిన్న బ్రెగ్జిట్ ఒప్పందాలపై బ్రిటన్ పార్లమెంటు ఓటింగ్ జరిపింది. వీటిలో ఏ ఒక్కదానికీ ఆమోదం లభించలేదు. ఒప్పందం లేకుండా సమాఖ్య నుంచి వైదొలగటం, ఐరోపాతో ఒకే మార్కెట్ వ్యవస్థలో ఉండటం, కస్టమ్స్ సమాఖ్యలో కొనసాగటం, ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ, బ్రెగ్జిట్ రద్దు లాంటి ప్రతిపాదనలపై పార్లమెంటులో ఓటింగ్ జరిగింది.
ఈయూతో చర్చలు జరిపి ప్రధాని థెరిసా మే తయారు చేసిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటు రెండు సార్లు తిరస్కరించింది. దీనికి ప్రత్యామ్నాయం కనుగొనేందుకు దేశ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కస్టమ్స్ సమాఖ్యలో కొనసాగాలన్న బ్రెగ్జిట్ ప్రతిపాదన వీగిపోయినప్పటికీ.. అన్నింటి కంటే దీనికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు లభించింది. కేవలం ఎనిమిది ఓట్లతో ఇది తిరస్కరణకు గురైంది. దీనిని 272 మంది వ్యతిరేకించగా... 264 మంది సమ్మతించారు.
ఈయూ నుంచి వైదొలగేందుకు కావాల్సిన కొత్త డీల్‌ను బ్రిటన్ పార్లమెంటు ఏప్రిల్ 12 నాటికి ఆమోదించాల్సి ఉంది. ఇలా కాని పక్షంలో ఎలాంటి ఒప్పందం లేకుండానే సమాఖ్య నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
మొదట నిర్ణయించిన ప్రకారం బ్రిటన్ మార్చి 29న ఈయూ నుంచి వైదొలగాల్సి ఉంది. కానీ 'థెరిసా మే ఒప్పందం' ప్రతిపాదన తిరస్కరణతో ఇది ఆలస్యం అయింది.
థెరిసా మే ఆశలు ఆవిరి...
కన్జర్వేటివ్ పార్టీ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతిస్తోన్న ఉత్తర ఐర్లాండ్‌లోని బ్రిటన్ జాతీయవాద పార్టీ డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ(డీయూపీ)... థెరిసా మే బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతివ్వబోమని ప్రకటించింది. ఫలితంగా... బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదించుకోవాలన్న థెరిసా మే ఆశలు ఆవిరయ్యాయి.
బ్రెగ్జిట్ అనంతరం కూడా ఐర్లాండ్‌తో సరిహద్దు మూసివేయకూడదని థెరిసా మే ఒప్పందంలో ఉంది. దీనివల్ల ఉత్తర ఐర్లాండ్‌తో బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు క్షీణిస్తాయని డీయూపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్న పార్లమెంటు సభ్యులు డీయూపీ అంగీకరించినప్పుడు మాత్రమే ప్రధాని ఒప్పందాన్ని సమ్మతిస్తామని తెలిపారు.
రాజీనామా చేస్తాను.. మద్దతివ్వండి: థెరిసా మే
బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం లభించి, ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగిన అనంతరం ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని థెరిసా మే ప్రకటించారు. దీనితో కొందరు సభ్యులు ఒప్పందానికి మద్దతివ్వనున్నారు.
ప్రధాని ఒప్పందాన్ని ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్న మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఒప్పందాన్ని అంగీకరించే యోచనలో ఉన్నారు. బ్రెగ్జిట్ అనుకూల వర్గం సమావేశంలో జాన్సన్ మద్దతుదారైన మరో ఎంపీ కొనార్ బర్న్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. థెరిసా మే ప్రధాని పదవి నుంచి వైదొలిగితే ఆ రేసులో జాన్సన్ ఉండే అవకాశం ఉంది.
శుక్రవారం మళ్లీ పార్లమెంటుకు థెరిసా మే బ్రెగ్జిట్ ఒప్పందం..
పార్లమెంటు శుక్రవారం భేటీ కావాలన్న తీర్మానాన్ని బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి స్టీఫెన్ బార్క్లే పార్లమెంటు ముందుంచారు. ఆ రోజు ప్రభుత్వం మరోసారి(మూడోసారి) మే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇతర బ్రెగ్జిట్ ప్రత్యామ్నాయాలపైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.