ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనాను రూపుమాపగలమనే నమ్మకం వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. వైరస్ను నివారించడానికి ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా 90శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలు సమర్థంగా పని చేస్తున్నట్లు ప్రకటించగా... ఆది నుంచి ఆశాకిరణంగా మారిన ఆక్సఫర్డ్ టీకా మూడోదిగా అవతరించింది.
"చరిత్రలో ఏ వ్యాధికి ఇంత త్వరగా వ్యాక్సిన్ అభివృద్ధి జరగలేదు. వ్యాక్సిన్ తయారీలో ఇదో గొప్ప విజయం. ఈ శాస్త్రీయపరమైన విజయం గురించి ప్రస్తావించకుండా ఉండలేం. టీకా అభివృద్ధిలో ఇదో మైలురాయిగా చెప్పవచ్చు. అయితే టీకా అందుబాటులోకి రావడం ఎంత కీలకమో.. పంపిణీ చేయడం కూడా అంతే కీలకమే."
- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్