తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్ రేసులో ఏ దేశం ఎక్కడ? - novel-coronavirus-landscape-covid-19

ఇప్పుడు ప్రపంచం మొత్తం జపిస్తున్న మంత్రం వ్యాక్సిన్! అహోరాత్రులు శ్రమిస్తూ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీలోనే తలమునకలై ఉన్నారు. అదిగో కరోనా అంటే ఇదిగో వ్యాక్సిన్ అంటూ రోజుకో వార్త ప్రచారమవుతోంది. నిజానికి వ్యాక్సిన్ ప్రయోగాలు ఎంతవరకు వచ్చాయి? ఏ దేశం ముందంజలో ఉంది? వీటి సమర్థత ఏంటి?

novel-coronavirus-landscape-covid-19
వ్యాక్సిన్ తయారీలో పోటీ- సిద్ధంగా ఉన్నవి ఎన్నంటే!

By

Published : Jul 21, 2020, 4:28 PM IST

సమస్త మానవాళి ఏకమై ఓ వైరస్​ను అంతమొందించే ప్రయత్నాల్లో మునిగితేలుతోంది. వైరస్ భయాలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా... ఈ ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. ఈ సమయంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ప్రజలకు కాస్త భరోసానిస్తున్నాయి. వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు వేశామని పలు సంస్థలు చేస్తున్న ప్రకటనలు వైరస్​తో విసుగెత్తిన ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. కరోనాను తుదముట్టించే పూర్తిస్థాయి వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందన్న ఆశలను పెంచుతున్నాయి.

అగ్రస్థానంలో ఆక్స్​ఫర్డ్​!

ప్రపంచంలో ఎన్ని వ్యాక్సిన్​లు అభివృద్ధిలో ఉన్నా చాలా మంది దృష్టి ఆక్స్​ఫర్డ్ టీకాపైనే ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు.

మొదటి దశలో భాగంగా ఏప్రిల్​, మే నెలల్లో బ్రిటన్​లోని ఐదు ఆస్పత్రుల్లో 18-55 ఏళ్ల మధ్య వయసున్న 1077 మంది ఆరోగ్యవంతులపై టీకా ప్రయోగించారు. వీరిలో బలమైన యాంటీబాడీ, 'టీ-సెల్'​ రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగినట్లు ఫలితాల్లో వెల్లడించారు. వైరస్​ నుంచి ఏళ్ల తరబడి రక్షణ పొందడంలో టి-కణాలు కీలకం. ఈ టీకా వల్ల అనూహ్యమైన దుష్ప్రభావాలేవీ మొదటి, రెండో దశల ప్రయోగాల్లో తలెత్తలేదని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు.

మోడెర్నా

అమెరికాకు చెందిన మోడెర్నా టీకా ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల కోసం సన్నద్ధమవుతోంది. టీకా ప్రాథమిక క్లినికల్‌ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలిచ్చినట్లు సంస్థ వెల్లడించింది. తొలిదశలో భాగంగా 45 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చింది. కరోనాపై పోరాడే రోగనిరోధక శక్తి వీరిలో ఏర్పడినట్లు గుర్తించామని వెల్లడించింది. అలాగే ఈ టీకా సురక్షితమైనదని కూడా ప్రాథమికంగా నిర్ధరణ అయినట్లు తెలిపింది. ఎవరిలోనూ తీవ్రమైన దుష్పరిణామాలు కానరాలేదని పేర్కొంది. అయితే, రెండు డోసు అందుకున్న తర్వాత కొంత మందిలో వికారం, కండరాల నొప్పులు, తలనొప్పి, చలి, టీకా ఇచ్చిన చోట నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది.

ఈ టీకాను అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. తరువాతి దశలో భాగంగా 30 వేల మంది వలంటీర్లపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఈ టీకా ప్రాథమిక పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది.

సగం వ్యాక్సిన్​లు చైనావే

కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే ముందున్నానని చైనా చెబుతోంది. ఆ దేశానికి చెందిన సినోఫార్మ్... ప్రభుత్వం అనుమతి లేకుండానే ప్రయోగాత్మ డోసులను సంస్థ ఉన్నతాధికారులపై ప్రయోగించినట్లు వెల్లడించింది. 30 మంది ప్రత్యేక వలంటీర్లు వ్యాక్సిన్​ ట్రయల్స్​లో పాల్గొనేందుకు ముందుకొచ్చారని తెలిపింది.

ప్రభుత్వం అనుమతులు లేకున్నా మానవ ప్రయోగాలు చేపట్టడంపై పశ్చిమ దేశాల పరిశోధకులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ తయారీలో మాత్రం చైనా వేగంగానే దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవ ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్​లలో దాదాపు సగం చైనాలోనే ఉన్నాయి.

చైనా సైన్యానికి చెందిన వైద్య విభాగం ఇప్పటికే ఎడినోవైరస్‌ వెక్టార్‌ వ్యాక్సిన్‌ను శరవేగంగా తయారు చేస్తోంది. రెండో వ్యాక్సిన్​పై వుహాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ(డబ్ల్యూఐవీ) ఇప్పటికే క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభించింది. మూడో వ్యాక్సిన్​ను చైనా నేషనల్​ ఫార్మాస్యూటికల్​ గ్రూప్​(సినోఫార్మ్​) ఆధ్వర్యంలోని వుహాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బయలాజికల్​ ప్రోడక్ట్స్​ తయారుచేస్తోంది.

మరొకటి!

చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లు లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. చైనాలో నిర్వహించిన ఫేజ్​- 2 క్లినికల్ ట్రయల్స్​లో వ్యాక్సిన్ సురక్షితమని తేలినట్లు పేర్కొంది. వ్యాక్సిన్ స్వీకరించినవారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు ఉత్పత్తి అయినట్లు తెలిపింది.

508 మంది ఇందులో పాల్గొనగా.. 253 మందికి అధిక డోసు టీకా, 129 మందికి తక్కువ డోసు టీకాను అందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మరో 126 మందికి నకిలీ టీకాను ఇచ్చినట్లు వెల్లడించారు.

అయితే ఈ ప్రయోగంలో పాల్గొన్నవారు కరోనా బారిన పడలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కరోనా సోకిన వ్యక్తుల్లో వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

రష్యా

వ్యాక్సిన్ తయారీలో రష్యా సైతం ముందడుగు వేస్తోంది. దేశంలో తయారు చేసిన టీకాను వచ్చే నెల ఆరంభంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. టీకాకు సంబంధించి రెండు క్లినికల్ ప్రయోగాలను పూర్తిచేసింది. మూడో విడత ప్రయోగాలను రష్యాతో పాటు సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఆగస్టు 3న ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చేనెలలో టీకా అందుబాటులోకి వస్తుందని రష్యా ప్రకటించింది.

ఇదీ చదవండి-రష్యా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి!

పరిశోధనకు సంబంధించి చాలా పని మిగిలి ఉన్నప్పటికీ.. టీకా మాత్రం సమర్థమైన ఫలితాలు ఇచ్చిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ ఇంకా ఆమోదం పొందక ముందే రష్యా దిగ్గజ వ్యాపారవేత్తలు, రాజకీయ అగ్రనేతలు దీన్ని వేయించుకోవడం గమనార్హం.

భారత్

భారత్​లోనూ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. భారత్​ బయోటెక్​కు చెందిన 'కొవాగ్జిన్', జైడస్ కాడిలాకు చెందిన జైకొవ్-డీ వ్యాక్సిన్​లకు క్లినికల్ ట్రయల్స్​ అనుమతులు లభించాయి. భారత వైద్య పరిశోధనా మండలితో కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తోంది భారత్ బయోటెక్. వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఈ రెండు సంస్థలు ఇప్పటికే తమ వ్యాక్సిన్​ను మనుషులపై ప్రయోగిస్తున్నాయి.

ప్రయోగాలు విజయవంతమైతే ఏడు నెలల్లో టీకా విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు జైడస్ కాడిలా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 24 టీకాలు

డబ్ల్యూహెచ్​ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 24 టీకాలు ప్రస్తుతం వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి.

డెవలపర్ అభివృద్ధి దశ
సినోవాక్ ఫేజ్​-3
ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ/ఆస్ట్రాజెనెకా ఫేజ్​- 3

కాన్​సినో బయోలాజికల్ ఐఎన్​సీ/

బీజింగ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ

ఫేజ్ 2

అన్​హుయి జిఫీ లాంగ్​కామ్ బయో ఫార్మాసిటికల్స్/

ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్

ఫేజ్ 2
మోడెర్నా ఫేజ్​- 3( ప్రయోగం కోసం మనుషులను చేర్చుకోలేదు)
కాడిలా హెల్త్​కేర్ లిమిటెడ్ ఫేజ్​ 1/2
వుహాన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్​/సినోఫార్మ్ ఫేజ్​ 1/2
బీజింగ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్​/సినోఫార్మ్ ఫేజ్​ 1/2
భారత్ బయోటెక్ ఫేజ్​ 1/2

టీకా కోసం పోటీ

ఇలా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారిపై విజయం సాధించేందుకు దేశదేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. వీరిలో ఎవరు ముందంజలో నిలుస్తారో వేచి చూడాలి.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details