తెలంగాణ

telangana

మరో రెండు దేశాల్లో 'కొత్త' కరోనా కలవరం

By

Published : Dec 24, 2020, 12:30 PM IST

ఆఫ్రికా, యూకే దేశాలను కలవరపెడుతోన్న కొత్తరకం కరోనా వైరస్.. తాజాగా​ మరో రెండు దేశాలకు వ్యాపించింది. ఇజ్రాయెల్​లో నలుగురు వ్యక్తులు.. మార్పు చెందిన మహమ్మారి బారినపడగా.. ఉత్తర ఐర్లాండ్​లో ఈ తరహాలోనే ఓ కేసు వెలుగుచూసింది. ఇజ్రాయెల్​లో వైరస్​ సోకిన నలుగురిలో.. ముగ్గురు ఇటీవల బ్రిటన్​ నుంచే వచ్చారని తెలుస్తోంది.

Northern Ireland and Israel report new coronavirus strain
మరో రెండు దేశాల్లో 'కొత్తరకం' కరోనా కలవరం

బ్రిటన్‌లో ఇటీవల వెలుగుచూసిన కొత్త కరోనా వైరస్‌ తాజాగా మరో రెండు దేశాలకు పాకింది. ఇజ్రాయెల్‌, ఉత్తర ఐర్లాండ్‌లో ఈ రకం వైరస్‌ కేసులు బయటపడ్డాయి. ఇజ్రాయెల్‌లో నలుగురు వ్యక్తులు మార్పు చెందిన వైరస్ బారినపడగా.. వీరిలో ముగ్గురు ఇటీవల ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన వారే. ప్రస్తుతం వీరంతా ఓ హోటల్‌లో నిర్బంధంలో ఉన్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తర ఐర్లాండ్‌లోనూ ఓ కేసు నమోదైంది.

భారత్​లోనూ గుబులు..

ఇక భారత్‌లోనూ మార్పు చెందిన వైరస్‌ కలవరపెడుతోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 31 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది కేంద్రం. అంతకుముందు యూకే నుంచి వచ్చిన వారిలో పలువురికి కొవిడ్‌ పాజిటివ్​గా నిర్ధరణ అయినందున.. దేశంలో అలజడి మొదలైంది. అయితే.. వీరికి సోకిన వైరస్‌ కొత్త రకమా? కాదా అన్నది తెలియరాలేదు. ప్రస్తుతం అడ్వాన్స్‌ పరీక్షల నిమిత్తం వీరి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. యూకే నుంచి ఇటీవల వచ్చిన వారంతా కొన్ని వారాల పాటు ఐసోలేషన్‌లోనే ఉండాలని ప్రజలకు సూచించాయి.

ఇదీ చదవండి:మరో వేషంలో మహమ్మారి.. మరింత ప్రమాదకారి.!

'మా టీకా పనిచేస్తుంది'

కొత్త రకం వైరస్‌పై తమ టీకా విజయవంతంగా పనిచేసే అవకాశాలున్నాయని మోడెర్నా భావిస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు త్వరలోనే మ్యూటేషన్‌కు గురైన వైరస్‌పై పరీక్షలు జరపనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. మోడెర్నాతో పాటు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా కూడా తమ టీకాలు పనిచేస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌ జన్యువులను స్వల్పంగా మార్చుకోవడం వల్ల బ్రిటన్‌కు కొత్త ముప్పు ఎదురైంది. దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెంది అక్కడ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మరో రకం కొవిడ్‌-19 వైరస్‌ తాజాగా లండన్‌ చేరింది. ఇప్పటికే ఇద్దరు పౌరులు దీని‌ బారిన పడినందున అప్రమత్తమైంది జాన్సన్​ సర్కార్​. ఆ దేశానికి విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేసింది. అయితే.. దక్షిణాఫ్రికాలో బయటపడిన రకం వైరస్‌.. బ్రిటన్‌లో వెలుగుచూసిన రకం వైరస్‌‌ కంటే వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలివే!

ABOUT THE AUTHOR

...view details