నోబెల్ శాంతి బహుమతి లభించడం వల్ల ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసే అవకాశం తమకు లభించిందని ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) చీఫ్ డేవిడ్ బీయాస్లే పేర్కొన్నారు. 2020 సంవత్సరంతో పోలిస్తే 2021 మరింత కఠినంగా ఉంటుందని చెప్పేందుకు ఇదో మంచి అవకాశమని అన్నారు. నిధులు సంవృద్ధిగా లేకుంటే తీవ్రస్థాయి క్షామం ఏర్పడుతుందని హెచ్చరించారు.
"సంక్షోభాలు, సంఘర్షణల పరిస్థితుల్లో శరణార్థి శిబిరాల్లో మా సంస్థ చేసే పనులను నార్వే నోబెల్ కమిటీ పరిశీలించింది. లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించేందుకు సిబ్బంది తీసుకుంటున్న రిస్క్‌ను గుర్తించింది. అదే సమయంలో, మరింత కఠినమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సందేశం ఇచ్చింది."
-డేవిడ్ బియాస్లే, ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
కరోనాతో పాటు ఆకలి సంక్షోభంపైనా ప్రభుత్వాలు పోరాడాలని సూచించారు బియాస్లే. సత్వర చర్యలు తీసుకోకపోతే.. కొద్ది నెలల్లోనే విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని ఐరాస భద్రతా మండలికి చేసిన సూచనలను గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నందున 2021లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు.
"డబ్బు, ఉద్దీపన పథకాలు, రుణ వాయిదాల ద్వారా 2020లో సంక్షోభాన్ని ప్రపంచ నేతలు నివారించగలిగారు. కానీ కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు దిగజారుతున్నాయి. ముఖ్యంగా అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో పరిస్థితి తీవ్రమవుతోంది. మరోసారి లాక్డౌన్లు విధిస్తున్నారు. 2020లో అందుబాటులో ఉన్న డబ్బు 2021లో అందుబాటులో ఉండకపోవచ్చు. సంక్షోభాలు ఇప్పటితో పోలిస్తే వచ్చే 12-18 నెలల్లో అత్యంత తీవ్రంగా మారవచ్చు."
-డేవిడ్ బియాస్లే, ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్