తెలంగాణ

telangana

ETV Bharat / international

కృష్ణబిలాల గుట్టు తేల్చిన ముగ్గురికి నోబెల్ - నోబెల్ బహుమతి

భౌతిక శాస్త్రంలో 2020 ఏడాదికి గాను నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. రోజర్​ పెన్​రోస్​ సహా రీన్​హార్డ్ గెంజెల్, ఆండ్రియా ఘెజ్​కు సంయుక్తంగా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి.

nobel physics
నోబెల్

By

Published : Oct 6, 2020, 3:44 PM IST

Updated : Oct 6, 2020, 4:38 PM IST

భౌతిక శాస్త్రంలో 2020కి గాను నోబెల్ ​బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి. ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయానికి చెందిన రోజర్​ పెన్​రోస్​తో పాటు రీన్​హార్డ్ గెంజెల్​, ఆండ్రియా ఘెజ్​కు సంయుక్తంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. కృష్ణబిలాలపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపింది.

వీరిలో పెన్​రోస్​​కు సగం బహుమతి ప్రకటించగా.. మిగతా సగంలో రీన్​హార్డ్, ఆండ్రియాకు సంయుక్తంగా అందజేస్తున్నట్లు తెలిపారు అకాడమి ప్రధాన కార్యదర్శి గోరన్​ కే హన్​సన్​.

డార్క్ సీక్రెట్స్​పై పరిశోధనలు..

విశ్వంలోని అంతుచిక్కని రహస్యాలు, కృష్ణ బిలాల పుట్టుకపై పరిశోధనలు చేసిన వీరికి ఈ సారి నోబెల్ దక్కింది. సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా కృష్ణ బిలాల ఆవిర్భావాన్ని సులువుగా గుర్తించేందుకు చేసిన పరిశోధనలకు గుర్తింపుగా పెన్​రోస్​కు ఈ అవార్డు వరించింది.

ఆల్బర్ట్ ఐన్​స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రత్యక్ష ఫలితమే కృష్ణ బిలాలని గణిత పద్ధతుల ద్వారా నిరూపించారు పెన్​రోస్​.

అయితే, కాంతి సహా ప్రతి వస్తువును తనలో విలీనం చేసుకునే కృష్ణ బిలాల ఉనికిని ఐన్​స్టీన్​ విశ్వసించలేదు. సాపేక్ష సిద్ధాంతానికి సంబంధించి పెన్​రోస్​ పరిశోధన ఇప్పటికీ కీలక ఆధారంగా పరిగణిస్తున్నారు.

పాలపుంత కేంద్రంలో కృష్ణ బిలం..

పాలపుంత కేంద్రంలో 'సూపర్​మాసివ్​​ కాంపాక్ట్ ఆబ్జెక్ట్'​ను గుర్తించినందుకు గాను రీన్​హార్డ్​, ఆండ్రియాకు నోబెల్​ను ప్రకటించారు. పూర్తిగా ధూళితో నిండి ఉన్న పాలపుంత కేంద్ర భాగంపై వీరిద్దరు పరిశోధనలు చేశారు. మనం చూడలేని ఎన్నో నక్షత్రాల కదలికలపై దృష్టి సారించారు. అక్కడ అత్యంత భారీ కృష్ణ బిలం ఉన్నట్లు గుర్తించారు. ఇది మన సూర్యునికి 40 లక్షల రెట్లు పెద్దదని భావిస్తున్నారు.

రోజర్ పెన్​రోస్​... బ్రిటన్​లోని కోల్​చెస్టర్​లో 1931లో జన్మించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి 1957లో పీహెచ్​డీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు.

రీన్​హార్డ్ గెంజెల్..జర్మనీలోని హాంబర్గ్​లో 1952లో జన్మించిన ఈయన.. 1978లో బాన్​ విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు.

ఆండ్రియా ఘెజ్​..న్యూయార్క్​లో 1965లో జన్మించారు. కాలిఫోర్నియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీలో 1992లో పీహెచ్​డీ పొందిన ఈమె.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు.

భౌతిక శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న నాలుగో మహిళగా ఆండ్రియా నిలిచారు. డోనా స్ట్రిక్‌ల్యాండ్, మరియా గోపెర్ట్ మేయర్, మేరీ క్యూరీ తర్వాత ఈ ఘనత సాధించిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

వీరికి బంగారు పతకంతో పాటు 11 లక్షల డాలర్ల నగదును అందజేయనున్నారు.

ఇదీ చూడండి:ఆ వైరస్​ను కనుగొన్న ముగ్గురికి నోబెల్​

Last Updated : Oct 6, 2020, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details