పెరిగిపోతున్న భూతాపంపై పోరాడుతున్న యువ కార్యకర్త నుంచి అగ్రరాజ్య అధినేత వరకూ ఎంతోమంది ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారంగా పేరుగాంచిన నోబెల్ అవార్డు అందుకోవటానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం.. నార్వేయన్ నోబెల్ కమిటీ పురస్కార విజేతను ప్రకటించనుంది.
ఈ ఏడాది.. 318 మంది అభ్యర్థులు.. నోబెల్ శాంతి బహుమతి అందుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో 211మంది వ్యక్తులు ఉండగా.. 107 సంస్థలు నామినేషన్ దక్కించుకున్నాయి. సెలక్ట్ గ్రూప్‌తో పాటు.. న్యాయనిపుణులు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా విజేతను ఎంపిక చేయనున్నాయి. పురస్కార విజేత విషయంలో పూర్తి గోప్యత పాటిస్తారు.
పోటీలో ప్రముఖులు...
ఈ ఏడాది పోటీలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్వీడన్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఫిబ్రవరి 1 నాటికే నామినేషన్ల పర్వం ముగిసినందున... కొవిడ్-19తో పోరులో ముందుండి పని చేస్తున్న.. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పోటీకి అవకాశం లేకుండా పోయింది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారులు.
గ్రెటా థన్‌బర్గ్
- పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాధినేతలతో పోరాటం చేస్తోన్న ఈ స్వీడిష్ బాలిక.. ఆంతర్జాతీయంగా మన్ననలు అందుకున్నారు.
- భూతాపం, వాతావరణ మార్పుల గురించి తీవ్ర అందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రెటాకు.. పురస్కారం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
- పర్యావరణ పరిరక్షణ పోరుకు నోబెల్ బహుమతితో మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్
- వరసగా రెండో ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీ పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
- ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య శాంతి నెలకొల్పిన ఘనత తనకే చెందుతుందని, శాంతి పురస్కారానికి అన్ని విధాల అర్హుడునని ఆయన భావిస్తున్నారు.
- ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు నోబెల్ నామినేషన్ దక్కింది.
- మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకుగానూ.. వచ్చే ఏడాది సైతం ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యే అవకాశాలున్నాయి.
- అయితే, ట్రంప్... ప్యారిస్ ఒప్పందం సహా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు వచ్చేయటం, ఇరాన్‌తో కయ్యం వంటి అంశాలు ఆయనకు చేటు చేసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.