విశ్వవ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో 'హెర్డ్ ఇమ్యూనిటీ' ద్వారా ఈ వైరస్ నుంచి విముక్తి పొందవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించలేదని స్పెయిన్ పరిశోధనల్లో వెల్లడైంది. అక్కడి జనాభాలో కేవలం 5శాతం ప్రజల్లో మాత్రమే కరోనా వైరస్ యాంటీబాడీస్ వృద్ధిచెందినట్లు నిరూపితమైంది.
జనాభాలో ఎక్కువ మంది వైరస్‌ను తట్టుకునే శక్తిని కలిగి ఉండటాన్ని 'హెర్డ్ ఇమ్యూనిటీ'గా వ్యవహరిస్తారు. ఈ శక్తిని సాధించాలంటే జనాభాలో కనీసం 60శాతం మంది వైరస్ నుంచి కోలుకొని ఉండటమో లేదా వ్యాక్సిన్ ద్వారా సాధించడమో జరగాలని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, కరోనా మహమ్మారి ధాటికి వణికిపోయిన స్పెయిన్ హెర్డ్ ఇమ్యూనిటీని తెలుసుకునేందుకు భారీ స్థాయిలో యాంటీబాడీల పరిశోధనలు చేపట్టింది. గడిచిన మూడు నెలల్లో అక్కడ దాదాపు 70వేల మందిని మూడుసార్లు పరీక్షించింది. ఈ మూడు నెలల కాలంలో వైరస్ తీవ్రతలో ఎలాంటి మార్పు కనిపించలేదని కనుగొంది. వైరస్‌ను ఎదుర్కొనే శక్తి స్వల్పకాలమేనని.. పరిశోధనల్లో పాల్గొన్న వారిలో దాదాపు 14శాతం మందికి తొలుత యాంటీబాడీస్ ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో వారు ఆ శక్తి కోల్పోయినట్లు తేలింది. రోగనిరోధక శక్తి తాత్కాలికంగా ఉండడంతోపాటు కొంతకాలానికి అది పూర్తిగా అదృశ్యం అయ్యే అవకాశం కూడా ఉందని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ రాక్వెల్ యొట్టి స్పష్టంచేశారు. ఇప్పటివరకు స్పెయిన్‌లో 5.2శాతం మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. మిగతా 95శాతం ప్రజలు ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో స్పెయిన్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండడంతోపాటు సాధ్యమైనంతవరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.