ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నైజీరియాకు చెందిన ఎంగోజీ ఆకోంజో ఈవేలా ఎంపికకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియా అభ్యర్థి 'యూ మ్యూంగ్ హీ' రేసు నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఆకోంజో బాధ్యతలు స్వీకరిస్తే డబ్ల్యూటీఓ డీజీ పదవిని అధిరోహించిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్‌గా ఆమె రికార్డుకెక్కనున్నారు.
డీజీ ఎంపికపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో నవంబర్‌లో ఈ ప్రక్రియ కొద్ది కాలం నిలిచిపోయింది. ఫిబ్రవరి 5న కొరియా అభ్యర్థి వెనక్కి తగ్గిన వెంటనే.. ఎంగోజీకి మద్దతు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆర్థిక రంగంతో పాటు, అంతర్జాతీయ దౌత్య విషయాల్లో ఎంగోజీకి ఉన్న 25 ఏళ్ల అనుభవం డబ్ల్యూటీఓకు ఉపకరిస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకుతో పాటు, నైజీరియా ఆర్థిక మంత్రిగా తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని తెలిపింది.
అమెరికా ప్రకటనతో ఎంగోజీ ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే తెలుస్తోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు సాధారణ మండలి సమావేశాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు సమాచారం.