ఆట పాటలతో హుషారుగా ఉండాల్సిన కిశోరప్రాయం స్తబ్ధుగా తయారవుతోంది! సెల్‌ఫోన్‌కు దగ్గరవుతూ మైదానానికి దూరమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 146 దేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80 శాతం కంటే ఎక్కువమంది రోజుకు కనీసం గంటసేపు కూడా వ్యాయామం చేయట్లేదు. ఫలితంగా వారి శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పెరుగుతున్నాయి. మేధో వికాసంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధకులు జరిపిన అధ్యయనం ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టింది. పిల్లల్లో శారీరక క్రియాశీలతను పెంచేందుకు సత్వరం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకోవాలని సూచించింది.
బంగ్లాదేశ్ కాస్త మెరుగు
ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో కనీసం నలుగురు రోజుకు గంట సేపు కూడా శారీరక శ్రమ చేయట్లేదు. 78% బాలురు, 85% బాలికల్లో ఈ పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంది. ఆ దేశంలో 66% మంది బాలలు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. ఫిలిప్పీన్స్‌లో కేవలం 7% మంది బాలురు, దక్షిణ కొరియాలో 3% మంది బాలికలు మాత్రమే రోజుకు గంటపాటు శారీరక శ్రమ చేస్తున్నారు.