తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాకు మరో టీకా- ఒక్క డోసుతోనే వైరస్​కు బ్రేక్!

కరోనా నియంత్రణకు మరో టీకా అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఎల్లో ఫీవర్ వ్యాధి నివారణకు ఉపయోగించే టీకాను ఆధారంగా చేసుకొని కొవిడ్ వ్యాక్సిన్​ను రూపొందించారు. ఎలుకలు, కోతులపై ఈ టీకాను ప్రయోగించగా.. ఉత్తమ ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

New single dose vaccine shows protection against COVID-19: Study
ఎల్లో ఫీవర్ టీకా ఆధారంగా కరోనా వ్యాక్సిన్

By

Published : Dec 2, 2020, 4:39 PM IST

ఎల్లో ఫీవర్ టీకాను ఆధారంగా చేసుకొని కరోనాకు కొత్త వ్యాక్సిన్ క్యాండిడేట్​ను శాస్త్రవేత్తలు రూపొందించారు. వీరు తయారు చేసిన టీకా సింగిల్ డోసు.. ఎలుకలు, కోతులను సార్స్-కొవ్-2 వైరస్ నుంచి సమర్థంగా కాపాడింది. బెల్జియంలోని రేగా ఇన్​స్టిట్యూట్​కు చెందిన పరిశోధకులు ఈ టీకాపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు కరసత్తులు చేస్తున్నారు. ఈ టీకాను 'రేగావ్యాక్స్​'గా పిలుస్తున్నారు.

టీకా అభివృద్ధి చేసేందుకు ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్​లోకి సార్స్-కొవ్-2 వైరస్ స్పైక్ ప్రోటీన్లను పంపించారు. ఆరోగ్యంగా ఉన్న ఎలుకలు, కోతులపై టీకాను ప్రయోగించారు. తర్వాత వీటికి ముక్కు ద్వారా వైరస్​ను పంపించారు. పది రోజుల తర్వాత చాలా వరకు ఎలుకలు వైరస్​ను తట్టుకున్నాయి. మూడు వారాల తర్వాత పూర్తిగా కోలుకున్నాయి. ఈ పరిశోధన వివరాలను 'నేచర్' జర్నల్ త్వరలో ప్రచురించనుంది.

వేగంగా మాయం

ఎలుకల్లో ఎలాంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తలెత్తలేదని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ జోహాస్ నెయిట్స్​ పేర్కొన్నారు. కోతులలో ఏడు రోజుల్లోనే ప్రతిరోధకాలను గుర్తించినట్లు చెప్పారు. 14 రోజుల తర్వాత అన్ని జంతువులలో యాంటీబాడీలు కనిపించాయని స్పష్టం చేశారు. వైరస్ ప్రయోగించిన అన్ని జంతువుల గొంతులో నుంచి వైరస్ పూర్తిగా కనుమరుగైందని వివరించారు. ఇది చాలా వేగంగా జరిగిందని అన్నారు.

"ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఇతర వ్యాక్సిన్​లతో పోలిస్తే రేగావ్యాక్స్​ ఒక్క డోసుతోనే సమర్థంగా పనిచేస్తుంది. ఇతర టీకాల విషయంలో.. నెల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. అధునాతన వైద్య వ్యవస్థ లేని దేశాలకు, లాజిస్టిక్ ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు మా టీకా ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. కొవిడ్​కు వ్యతిరేకంగా ఈ టీకా దీర్ఘకాలం సమర్థంగా పనిచేస్తుందని మేం భావిస్తున్నాం."

-ప్రొఫెసర్ జోహాస్ నెయిట్స్​, రేగా ఇన్​స్టిట్యూట్, బెల్జియం

ఈ వ్యాక్సిన్​ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసుకోవచ్చని ప్రొఫెసర్ జోహాస్ తెలిపారు. కరోనాకు తయారుచేస్తున్న వ్యాక్సిన్​లలో ఎల్లో ఫీవర్​ను తట్టుకొనే టీకా ఇదొక్కటే అని చెప్పారు. 80 సంవత్సరాలుగా ఎల్లో ఫీవర్ టీకా వాడుకలో ఉందని, దీని సమర్థత ఇప్పటికే రుజువైందని అన్నారు. '50 కోట్ల మంది ఎల్లో ఫీవర్ టీకాను స్వీకరించారు. ఒక్క డోసు టీకా ఎల్లో ఫీవర్ నుంచి రక్షించేందుకు ఉపయోగపడుతుంది. దాదాపు అన్ని సందర్భాల్లో దీని సమర్థత జీవితకాలం ఉంటుంది' అని చెప్పారు. కొవిడ్​కు, ఎల్లో ఫీవర్​కు వ్యతిరేకంగా పనిచేసే టీకా.. 2026 నాటికి ఎల్లో ఫీవర్​ను పూర్తిగా నివారించాలన్న డబ్ల్యూహెచ్​ఓ లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details