ప్రపంచానికి దిక్కు తోచకుండా చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పరిశోధకులు ఓ ప్రభావవంతమైన చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. 2003లో ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించిన సార్స్ వ్యాధి నివారణకు చక్కగా ఉపకరించిన ఈ విధానమే.. కరోనా వైరస్‌నూ కట్టడి చేయగలదని స్వీడన్ పరిశోధకులు తెలిపారు.
కరోనా వైరస్‌పై ప్రత్యక్ష ప్రభావం
రెడాక్స్ బయాలజీ అనే జర్నల్‌లో ప్రచురించిన ఓ పరిశోధనా ఫలితాలు.. కొవిడ్-19 చికిత్సలో నైట్రిక్ ఆక్సైడ్ కీలకమని తెలిపాయి. యాంటీ వైరల్ లక్షణాలు గల ఈ పదార్థాన్ని మానవ శరీరం చాలా సందర్భాల్లో తనంతట తానే ఉత్పత్తి చేసుకోగలదని పరిశోధకులు వివరించారు. తమకు తెలిసినంత వరకూ నైట్రిక్ ఆక్సైడ్ ఒకటే కరోనా కారక వైరస్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపగల ఏకైక పదార్థమని.. పరిశోధనకు నేతృత్వం వహించిన ఉప్సలా విశ్వవిద్యాలయ పరిశోధకుడు అకే లుండ్విస్ట్ స్పష్టం చేశారు. దీనిని కరోనా వైరస్‌పై ప్రయోగించినపుడు ప్రభావం స్పష్టంగా కనిపించిందని.. డోసు పెంచిన కొద్దీ కరోనా వైరస్‌పై ప్రభావం కూడా అధికమయ్యిందని వారు తేల్చారు.
ఊపిరితిత్తుల సమస్యలకు భేష్
వివిధ శరీర భాగాల పనితీరు నియంత్రించే హార్మోనుగా కూడా నైట్రిక్ ఆక్సైడ్ పనిచేస్తుందని వారు తెలిపారు. రక్తనాళాల్లో ఒత్తిడి, వివిధ శరీర భాగాలకు రక్తప్రసార నియంత్రణ వంటి విధులను ఇది నిర్వహిస్తుందన్నారు.
నిర్ధారిత కొవిడ్ చికిత్స ఏదీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవటం వల్ల ఈ వ్యాధి లక్షణాలు నయమయ్యే ఔషధాలను మాత్రమే ప్రస్తుతం బాధితులకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వల్ల ఊపిరితిత్తుల వైఫల్యం సంభవించినప్పుడు తక్కువ సాంద్రత గల నైట్రస్ ఆక్సైడ్‌ను వాయురూపంలో పీల్చడం ద్వారా రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచవచ్చని వారు వివరించారు. ఈ విధానం సార్స్ చికిత్సలో కూడా రోగి ఊపిరితిత్తుల సమస్యలకు చక్కగా ఉపయోగపడిందని తెలిపారు.
కొవిడ్ వ్యాక్సిన్ కనుగొనేంత వరకు నైట్రస్ ఆక్సైడ్‌ను శ్వాస ద్వారా అందించడాన్ని చికిత్సలో భాగంగా చేర్చటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. కాగా, మోతాదు, చికిత్సను ప్రారంభించే సమయం కరోనా నివారణలో ముఖ్య పాత్ర పోషించగలవని అన్నారు. అందుకే ఈ అంశాలపై వీలయినంత త్వరగా విస్తృత పరిశోధనలు జరగాలని వారు కోరారు.