కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలపై తీవ్రంగా పడినట్లు ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ వెల్లడించింది. సంక్షోభం కారణంగా ఇప్పటికే 90 శాతం తాత్కాలికంగా మూతపడగా, 13 శాతం మ్యూజియాలను శాశ్వతంగా మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
మే 18న అంతర్జాతీయ మ్యూజియం డే సందర్బంగా ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర సాంస్కృతిక సంస్థ(యునెస్కో), అంతర్జాతీయ ప్రదర్శనశాలల సమాఖ్య(ఐకామ్) నిర్వహించిన అధ్యయనాలలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కరోనా సంక్షోభ సమయంలో 90శాతం(85,000) మ్యూజియాలు సేవలను నిలిపివేసినట్లు వెల్లడైంది.
ఆఫ్రికా, అభివృద్ధి చెందుతున్న చిన్న ఐలాండ్ దేశాల్లో 5 శాతం మ్యూజియాలు మాత్రమే ఆన్లైన్లో ప్రేక్షకులకు ప్రదర్శనలు అందుబాటులో ఉన్నట్లు అధ్యయనాలు తెలిపాయి. 13 శాతం మ్యూజియాలు ఇక ఎప్పటికీ తెరుచుకోకపోవచ్చని స్పష్టం చేశాయి.
సమాజాల స్థితిస్థాపకతలో మ్యూజియాలు ప్రాథమిక పాత్ర పోషిస్తాయని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజోలే తెలిపారు. వాటిని సంక్షోభాన్ని ఎదుర్కొనేలా చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరముందున్నారు. కొవిడ్-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్లను మ్యూజియం నిపుణులు అధిగమిస్తారని ఐకామ్ అధ్యక్షుడు సువాయ్ అక్సోయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగం సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రజలు, ప్రైవేట్ రంగాల సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అత్యవసర సహాయ నిధులు సమకూర్చి మ్యూజియం నిపుణులు, స్వయం ఉాపాధి పొందుతున్న అనేక మందిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జ్ఞానానికి మూలం..
మ్యూజియంలు తాత్కాలికంగా మూసివేయవచ్చు, కానీ చాలా మందికి జ్ఞానానికి, ఆవిష్కరణలకు అవే మూలంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియే గుటెరస్ ట్వీట్ చేశారు. ఆన్లైన్ ద్వారా వాటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు.
కరోనా సంక్షోభంతో డిజిటల్ సాంకేతికత సగానికిపైగా మానవులకు అందుబాటులో లేదని తెలిసినట్లు యునెస్కో చీఫ్ తెలిపారు. సంస్కృతిని ప్రతి ఒక్కరికీ అందుబాటులో తెచ్చేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.