Britain's Youngest Grandmother: మూడు పదుల వయసులోనే అమ్మమ్మ అయింది బ్రిటన్కు చెందిన ఓ యువతి. ఆమె కుమార్తె 14 ఏళ్ల వయసులోనే మగబిడ్డకు జన్మనివ్వడమే ఇందుకు కారణం. ప్రస్తుతం మూడేళ్లు వయసున్న మనుమడిని చూసి చాలా మంది తన కుమారుడని భావిస్తున్నారని చెబుతోంది ఆమె. ఇంత చిన్న వయసులోనే బామ్మను అవుతానని అనుకోలేదని అంటోంది.
అది 2018... అప్పుడు 30 ఏళ్ల వయసున్న కెల్లీ హీలే పశ్చిమ లండన్ క్రాన్ఫర్డ్లో నివసించేది. అప్పటికే ఆమె ఐదుగురు పిల్లలకు తల్లి. వారిలో 14 ఏళ్ల స్కై సాల్టర్ ఒకరు. స్థానిక యువకుడితో రిలేషన్లో ఉన్న ఆ టీనేజర్.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంది. ఆమె అనుమానం నిజమైంది. ఆమె గర్భవతి అని తేలింది. అబార్షన్ చేయించుకుందామంటే వైద్యులు ఒప్పుకోలేదు. గర్భం దాల్చి ఇప్పటికే 36 వారాలు దాటిందని, ఇంత ఆలస్యంగా అబార్షన్ చేస్తే ప్రమాదమని హెచ్చరించారు. తక్షణమే వెస్ట్ మిడిల్సెక్స్ ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఈ మాటలతో షాక్ అయిన స్కై సాల్టర్.. కాసేపటికి తేరుకుంది. "గర్భవతిని అని తెలియగానే షాక్ అయ్యా. అయితే.. గర్భంలోని శిశువు గుండె చప్పుడు వినగానే.. నా హృదయం ప్రేమతో నిండిపోయింది. నా జీవితంలో ఇకపై నా బిడ్డదే మొదటి స్థానమని, నాది రెండో స్థానమని ఆ క్షణం అర్థమైంది" అని చెప్పింది స్కై సాల్టర్.
అండగా నిలిచిన తల్లి:ఎలాగోలా ధైర్యం చేసి ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది సాల్టర్. తల్లిదండ్రులదీ అదే పరిస్థితి. చివరకు ఆమె తల్లి సాల్టర్ను అర్థం చేసుకుంది. "ఇంత చిన్న వయసులోనే నేను బామ్మను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ.. కలయిక విషయంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని స్కై సాల్టర్పై ఇప్పుడు అరిచినంత మాత్రాన ఉపయోగం ఉండదు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రేమ, మద్దతు అందించడమే నేను చేయగలిగింది. ఒక తల్లిగా ఇలాంటివన్నీ భరించాల్సిందే." అని చెప్పింది కెల్లీ.
ఇంట్లో వాళ్ల సాయంతో ఆస్పత్రిలో చేరింది స్కై సాల్టర్. 2018 ఆగస్టులో మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి బెయిలీ అని నామకరణం చేసింది. ఇదంతా జరిగి మూడేళ్లు గడిచింది. ఇప్పుడు అమ్మమ్మ కెల్లీ హీలే వయసు 33. స్కై సాల్టర్కు 17 ఏళ్లు. ఆమె కుమారుడు బెయిలీకి మూడేళ్లు. "నేను ఇప్పటికీ 20+ వయసులో ఉన్నట్లే వ్యవహరిస్తా. అలాంటి నేను అమ్మమ్మను అయ్యానంటే కాస్త ఇబ్బందికరమే. నాకు మనుమడు ఉన్నాడని స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. చాలా మంది అతడు నా కుమారుడు అనుకుంటారు. నా సంగతి ఎలా ఉన్నా.. 48 ఏళ్ల వయసులోనే తనకు మునిమనుమడు ఉన్నాడని అంగీకరించేందుకు నా తల్లి ఇంకా సిద్ధంగా లేదు" అని చెప్పింది కెల్లీ.