దీర్ఘకాల కొవిడ్‌కు సరైన నిర్వచనం లేదు. దీనిపై ఇప్పుడిప్పుడే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనాలో ఇదే అసలు సమస్య అని పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాల కరోనాపై పరిశోధనలకు 50 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. తొలుత కొవిడ్ ఇన్‌ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత కూడా చాలా లక్షణాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అలసట, దగ్గు, ఛాతినొప్పి, తలనొప్పి,కండరాల నొప్పులు వంటివి ఉంటున్నాయి. ఈ సర్వేను సెప్టెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య నిర్వహించారు.
ఇందులో కొవిడ్ వచ్చి తగ్గిన వారిని ఎంపిక చేసుకుని 29 లక్షణాలపై ప్రశ్నించారు. వీరిలో 37శాతం మంది 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కనీసం ఒక లక్షణం కొనసాగిందని తెలిపారు.15 శాతం మందిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు 12 వారాలకు పైగా కొనసాగాయి. మహిళలు, వృద్ధుల్లో దీర్ఘకాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిక బరువు, పొగతాగే అలవాటు, పేదరికం, మొండి వ్యాధులు గలవారు, ఆసుపత్రి పాలైనవారిలో ఈ లక్షణాలు దీర్ఘకాలంపాటు ఉన్నాయి. అత్యధిక మందిలో అలసట కనిపిస్తోంది. ఇక ఆసుపత్రి పాలైనవారిలో మాత్రం శ్వాస సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ సర్వేపై ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ పాల్ ఇలియాట్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోందన్నారు. దీర్ఘకాల కొవిడ్‌పై అవగాహన తక్కువగా ఉందని.. తమ పరిశోధన.... చికిత్సకు కొంత ఉపయోగపడవచ్చని పేర్కొన్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్‌లు నిర్వహించిన మరో సర్వేలో కొవిడ్ వచ్చి తగ్గిన మధ్య వయస్కుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి దీర్ఘకాల లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు.