ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 15,495మంది మరణించారు. ఐరోపాలనే 10వేల మందికిపైగా చనిపోయారు. కేసుల సంఖ్య 3,60,000 దాటింది. ఐరోపా, అమెరికాలో నిత్యం వందలాది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యంత భయానకంగా మారిన ఇటలీలో మరణాల సంఖ్య గత రెండు రోజులతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. సోమవారం 601 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 6వేల 77కు చేరింది. ఇటలీలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 63వేల 927కు పెరిగింది. సోమవారం ఒక్కరోజే 4వేల 789 కేసులు బయటపడ్డాయి.
ఇటలీ తర్వాత స్పెయిన్‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 435 మంది చనిపోయారు. 4,321 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫ్రాన్స్‌లోనూ మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజులో 186 మంది మృతిచెందగా.. 3వేల 838 కేసులు నమోదయ్యాయి. ఇరాన్‌లో సోమవారం 127 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడగా.. 1,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అగ్రరాజ్యంలో
అమెరికాలోనూ కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. సోమవారం దాదాపు 100 మంది చనిపోయారు. 9వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 42 వేలు దాటాయి.