కరోనా వైరస్ ధాటికి ఇటలీ వణకిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విజృంభణ ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఎక్కువగా ఇటలీ వాసులే మృతి చెందుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో రెండో దఫా కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలోనూ ఇటలీలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ముందున్నాయి. అనంతరం ఎక్కువ మరణాలు యూరప్‌లోని ఇటలీలోనే చోటుచేసుకుంటున్నాయి. నిత్యం సరాసరి 600లకు పైగా ఇటాలియన్లు కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 68,800మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. ఇక అధిక మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో ఇటలీ ఐదో స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. అయితే, తక్కువ జనాభా ఉన్నప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) కూడా ఇటలీ మరణాలకు గల కారణాలను విశ్లేషించింది.
ఎక్కువ మరణాలు అందుకేనా..?
అధిక జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే ఇటలీలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి అక్కడి ప్రజల వయసే ప్రధాన కారణమని ప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో వృద్ధ జనాభా ఎక్కువగా ఉండటం, వారి ఆరోగ్య సమస్యలు ఈ మరణాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. జపాన్ తర్వాత అత్యంత వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు ప్రతి నలుగురు ఇటాలియన్లలో ఒకరు వయసు 65ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. కొవిడ్ మరణాల్లోనూ ఈ వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యూరప్‌లోనే అత్యంత ఎక్కువ వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు 22.8శాతం ప్రజలు 65ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. అక్కడి ప్రజల ఆయుర్దాయం 83సంవత్సరాలు. అయితే, జీవనకాలం ఎక్కువగా ఉన్నప్పటికీ 65ఏళ్ల వయసుపైబడిన వారిలో దాదాపు 70శాతం మందికి కనీసం రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. వీటి కారణంగా వైరస్ బారినపడటం మరింత ఇబ్బందిగా మారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.