తెలంగాణ

telangana

ETV Bharat / international

WHO: ఈ ఏడాదిలో కనీసం 30శాతం మందికి టీకాలు! - ప్రపంచ ఆరోగ్యసంస్థ

2022 నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్​ పూర్తిచేయాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్​ టెడ్రోస్‌ అథనోమ్‌ అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతో పని చేస్తేనే కరోనాను అంతం చేయగలమని.. అదే ప్రపంచ దేశాల ముందున్న అసలైన సవాల్​ అని పేర్కొన్నారు.

WHO chief
టెడ్రోస్‌ అధనోమ్‌

By

Published : Jun 14, 2021, 5:44 AM IST

కరోనా వైరస్‌తో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీకి జి-7 కూటమి చేస్తోన్న ప్రయత్నాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. ఆయా దేశాలు ఎదుర్కొంటున్న టీకా సమస్యలను ఇవి అధిగమిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు కూటమి దేశాలు మరింత వేగంగా స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

'మహమ్మారిని అంతం చేయాలంటే.. వచ్చే ఏడాది జర్మనీలో జరిగే జి-7 సమావేశం నాటికి ప్రపంచ జనాభాలో 70శాతం మందికి వ్యాక్సిన్‌ అందించే లక్ష్యంతో పనిచేయాలి. ఇదే మనముందున్న అసలైన సవాల్‌' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ గెబ్రెయెసస్‌ పేర్కొన్నారు. 2021 చివరి నాటికి ప్రతి దేశంలో కనీసం 30శాతం మందికి వ్యాక్సిన్‌ అందించాలని పునరుద్ఘాటించారు. ఇలా 70శాతం పూర్తి చేయాలంటే దాదాపు 1100కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అవసరమన్నారు. ఇందుకోసం జూన్‌, జులై నాటికి పది కోట్ల డోసుల చొప్పున పంపిణీ చేయాలని, సెప్టెంబర్‌ నాటికి 25కోట్ల డోసులకు పెంచాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్లకు మేధో సంపత్తి హక్కుల నుంచి ఆయా దేశాలు తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ డోసులను అందించేందుకు జి-7 దేశాలు ముందుకొచ్చాయి. వచ్చే ఏడాది కల్లా 100కోట్ల డోసులను కూటమి తరపున అందజేస్తామని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చారు. వీటిలో దాదాపు 50కోట్ల డోసులు అమెరికా అందజేస్తుండగా, 10కోట్ల డోసులను బ్రిటన్‌ ఇస్తుందని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ముగిసిన జీ7 సదస్సు- కీలక నిర్ణయాలివే

ABOUT THE AUTHOR

...view details