ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో నూతన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రెండు వేర్వేరు కరోనా టీకాలను ఇవ్వడం(వ్యాక్సిన్ మిక్సింగ్) ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తితో పాటు కొత్త రకాల నుంచి రక్షనిచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వారికి మేలే..
దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పందించారు. రెండు వేర్వేరు టీకాలను ఇవ్వడం వల్ల కొత్త రకాలపై వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.
"ఇప్పటికే ఒక డోసు టీకా ఇచ్చి కొరత వల్ల రెండో డోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇది ఒక అవకాశమనే చెప్పాలి. అయితే, యూకే, స్పెయిన్, జర్మనీ నుంచి లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం వల్ల జ్వరం, నొప్పి, సహా ఇతర దుష్ప్రభావాల తీవ్రత అధికంగా ఉన్నట్లు గమనించాం. అదే సమయంలో యాంటీబాడీలు, కరోనా సోకిన కణాలను చంపే తెల్లరక్త కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి చేయగలిగే బలమైన రోగనిరోధక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందన్నట్లు తెలుస్తోంది."