తెలంగాణ

telangana

ETV Bharat / international

రోగ నిరోధక వ్యవస్థే శత్రువు- సొంత కణజాలంపైనే దాడి!

కరోనా నుంచి కోలుకున్న వారిలో వ్యాధి నిరోధక స్పందన దారి తప్పుతోందని బ్రిటన్​ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని పర్యవసానంగా సొంత కణజాలం, అవయవాలపైనే దాడి జరుగుతుందని తెలిపారు. ఈ కారణంగా వైరస్​ నుంచి కోలుకున్న వారిలో అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

immune system,  post covid symptoms
రోగ నిరోధక వ్యవస్థ

By

Published : Jun 6, 2021, 3:08 PM IST

కొవిడ్‌-19 బారినపడిన అనేక మందిలో రోగ నిరోధక స్పందన దారితప్పి వారి సొంత కణజాలం, అవయవాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వారిలో కనిపిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఇదే కారణం కావొచ్చని తెలిపారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల అనూహ్య లక్షణాలు తలెత్తుతున్నాయి. అవి ఇన్‌ఫెక్షన్‌ సమయంలోను, అది తగ్గిన కొన్ని నెలల తర్వాత కూడా ఉంటున్నాయి. వీటికి కారణాలేంటన్నది శాస్త్రవేత్తలకు పూర్తిగా బోధపడటంలేదు. ఆటోఇమ్యూన్‌ ప్రక్రియను కొవిడ్‌ ప్రేరేపిస్తుండటం దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తూ వచ్చారు.

సొంత శరీరం పైనే దాడి..

ఈ ప్రక్రియ వల్ల బాధితుడి రోగనిరోధక వ్యవస్థ దారితప్పి సొంత శరీరంపైనే దాడి చేస్తుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే యాంటీబాడీల్లో ఆటో యాంటీబాడీలు స్వీయ ప్రొటీన్లపై దాడి చేస్తుంటాయి. వీటివల్ల ఆటోఇమ్యూన్‌ రుగ్మతలు తలెత్తుతుంటాయి. కొవిడ్‌ బాధితుల్లో సమస్యలకు వీటితో సంబంధం ఉందా అన్నది పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు 84 మందిపై పరిశోధన చేశారు. వీరంతా కరోనా బాధితులే. గిలియన్‌ బార్‌ సిండ్రోమ్‌ సహా అనేక ఆటోఇమ్యూన్‌ రుగ్మతలను కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రేరేపించొచ్చని తేల్చారు. ఇతర వ్యాధుల బారినపడిన వారితో పోలిస్తే కరోనా బాధితుల్లో ఆటో యాంటీబాడీలు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. అవి ఆరు నెలల వరకూ కొనసాగొచ్చని వారు పేర్కొన్నారు.

యాంటీ బాడీల తీరుల్లో వైవిధ్యం..

ఇతర వ్యాధులు బారినపడినవారిలోని ఆటో యాంటీబాడీల తీరుతెన్నుల్లో చాలా వైవిధ్యం ఉందని చెప్పారు. కొవిడ్‌ బాధితుల్లో మాత్రం చర్మం, ఎముకలు, కండరాలు, గుండెకు సంబంధించిన నిర్దిష్ట ఆటోయాంటీబాడీలు ఉంటున్నాయని పేర్కొన్నారు. తీవ్రస్థాయి కొవిడ్‌ బారినపడినవారి రక్తంలో ఇవి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని వివరించారు. వీటికి చర్మం, కండరాలు, గుండెకు సంబంధించిన ఆటోఇమ్యూన్‌ రుగ్మతలను కలిగించే లక్షణాలు ఉన్నాయని పరిశోధనకు నాయకత్వం వహించిన అలెక్స్‌ రిచర్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రాజ్యాంగ హక్కుగా ఆరోగ్యం!

ABOUT THE AUTHOR

...view details