జర్మనీ మొట్టమొదటి మహిళా ఛాన్సలర్, శక్తిమంతమైన నేత ఏంజెలా మెర్కెల్(angela merkel news) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన జర్మనీ జాతీయ ఎన్నికల్లో(German election results 2021) సోషల్ డెమొక్రాటిక్ పార్టీ .. 16 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మెర్కెల్ పార్టీ సెంటర్- రైట్ యూనియన్ బ్లాక్‌ను వెనక్కి నెట్టి ఆధిక్యాన్ని సాధించింది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి.
మొత్తం 299 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో సోషల్ డెమొక్రటిక్ పార్టీ 25.9 శాతం ఓట్లు సాధించినట్లు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. అయితే.. ఏంజెలా మెర్కెల్ పార్టీ సీడీయూ, సీఎస్‌యూ కన్జర్వేటివ్ బ్లాక్.. 24.1 శాతం ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన 31 శాతం ఓట్లను ఏ పార్టీ సొంతం చేసుకోకపోవటంలో కూటమితోనే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. పర్యావరణవేత్త గ్రీన్స్ పార్టీ 14.8 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత.. స్వేచ్ఛా వాణిజ్య అనుకూల డెమొక్రాట్స్ 11.5 శాతం ఓట్లు గెలుచుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటకు అతిపెద్ద పార్టీలైన ఎస్‌డీయూ, సీడీయూలతో కూటమి కోసం చర్చలు చేపడతామని సుముఖత వెల్లడించాయి.. ఇరుపార్టీలు. అలాగే.. లెఫ్ట్ పార్టీకి 4.9 శాతం ఓట్లు లభించాయి. 1949 తర్వాత తొలిసారి.. డానిష్ మైనారిటీ పార్టీ ఎస్‌ఎస్‌డబ్ల్యూ ఒక స్థానంలో గెలుపొందటం గమనార్హం.