ఊబకాయం ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడే కీలక ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భారీ స్థాయి అంతర్జాతీయ ప్రయోగాల్లో దీని సామర్థ్యం రుజువైంది. కొవిడ్-19 వంటి వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను నిర్వహించారు. ఇందులో 16 దేశాలకు చెందిన దాదాపు 2వేల మంది పాల్గొన్నారు.
ఆకలి హైజాక్..
సెమాగ్లుటైడ్ అనే ఈ ఔషధం.. మెదడులో ఆకలికి సంబంధించిన వ్యవస్థను హైజాక్ చేస్తుంది. తద్వారా ఆకలి తగ్గి, శరీరంలో చాలా పరిమితంగా కేలరీలు వచ్చి చేరుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాల్లో భాగంగా ఈ కొత్త ఔషధాన్ని పొందినవారిలో మూడో వంతు మంది తమ శరీరంలో దాదాపు ఐదో వంతు బరువును తగ్గించుకోగలిగారు. మూడొంతుల మందిలో 10 శాతం మేర బరువు తగ్గిందని పరిశోధనకు నేతృత్వం వహించిన రేచల్ బాటర్హామ్ చెప్పారు. ఈ స్థాయిలో బరువును తగ్గించే సామర్థ్యం ఏ ఔషధానికీ లేదన్నారు. ఇది చాలా విప్లవాత్మకమైందని చెప్పారు.
ప్రయోగంలో పాల్గొన్నవారికి సరాసరిన 15.3కిలోల మేర బరువు తగ్గిందని తెలిపారు. దీనివల్ల వారికి గుండె జబ్బు, మధుమేహానికి సంబంధించిన ముప్పు అంశాలైన రక్తంలోని కొవ్వు, బ్లడ్ షుగర్, రక్తపోటు వంటివి తగ్గాయని చెప్పారు.