తెలంగాణ

telangana

ETV Bharat / international

Queen Elizabeth: రాణి ఎలిజబెత్‌ హత్యకు యత్నం - క్వీన్​ ఎలిజబెత్​ వార్తలు

Queen Elizabeth: బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ను ఓ 19 ఏళ్ల యువకుడు హత్య చేసేందుకు ప్రయత్నించాడు. జలియన్​వాలా బాగ్​ మారణకాండకు ప్రతీకారంగా రాణిని హత్య చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

Queen Elizabeth
రాణి ఎలిజబెత్‌ హత్యకు యత్నం

By

Published : Dec 28, 2021, 6:45 AM IST

Queen Elizabeth బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ (95)ను హత్య చేయడానికి ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్టు చేశారు. తాను భారతీయ సిక్కునని, తన పేరు జస్వంత్‌ సింగ్‌ ఛాయిల్‌ అని అతడు చెప్పుకొన్నాడు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్‌ మారణకాండకు ప్రతీకారంగా రాణిని హత్య చేయదలచినట్టు పేర్కొన్నాడు. ఈ మేరకు స్నాప్‌చాట్‌లో వీడియో పెట్టాడు. దీనిని చిత్రీకరించిన సమయంలో పూర్తిగా ముసుగు ధరించి ఉన్నాడు. అతడి మానసిక స్థితిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడిని ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోవడానికి విండ్సర్‌ క్యాజిల్‌ రాజప్రాసాదానికి క్వీన్‌ ఎలిజబెత్‌ వెళ్లారు. శనివారం ఆ యువకుడు అక్కడికి వెళ్లాడు. చేతిలో విల్లువంటి క్రాస్‌బౌ ఆయుధం కూడా ఉంది. రాణి నివాసం వరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 24 నిమిషాల ముందు తీసుకున్న వీడియోనూ స్నాప్‌చాట్‌లో పెట్టాడు.

"నన్ను క్షమించండి. నేను చేసినదానికి, చేయబోయేదానికి క్షమించండి. రాజకుటుంబానికి చెందిన క్వీన్‌ ఎలిజబెత్‌ను హత్య చేస్తాను. 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ మారణకాండకు ఇది ప్రతీకారం. జాతి పేరుతో వివక్షకు గురయి ప్రాణాలు కోల్పోయిన వారు, అవమానాలకు గురయినవారి తరఫున పగ సాధిస్తాను. నేను భారతీయ సిక్కును. నా పేరు జస్వంత్‌ సింగ్‌ ఛాయిల్‌- డార్త్‌ జోన్స్‌" అని అందులో పేర్కొన్నాడు. స్టార్‌వార్స్‌ సినిమాలో ఓ ముసుగు మనిషి నల్లని ఆయుధాన్ని పట్టుకొని భయానక గొంతుతో మాట్లాడినట్టుగా ఈ వీడియో అనిపించింది. దీన్ని తన ఫాలోయర్లకు పంపించాడు. దాంతో పాటుగా ఓ సందేశం పెట్టాడు. "తప్పు చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు క్షమించండి. ఈ వీడియోను మీరు అందుకున్నారంటే నా చావు దగ్గరపడినట్టే లెక్క. అవకాశం ఉంటే దీన్ని షేర్‌ చేయండి. ఆసక్తి ఉంటే దీన్ని వార్తగా ప్రసారం చేయండి" అని అందులో పేర్కొన్నాడు. కుటుంబసభ్యులతో కలిసి సౌతాంప్టన్‌ ప్రాంతంలో అతడు నివసిస్తున్నాడు. పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు జరిపి ఒక క్రాస్‌బౌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి :రెండేళ్లలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైన దేశాలేవో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details