Man Changes Gender for retirement: స్విట్జర్లాండ్లో కొత్తగా వచ్చిన ఓ చట్టం లింగమార్పిడికి అనుమతిస్తుంది. అయితే ఇందులో ఉన్న లోపాన్ని కనిపెట్టిన ఓ వ్యక్తి దానిని అతనికి అనుకూలంగా మార్చుకున్నాడు. పదవీ విరమణ వయసు తగ్గడం సహా పెన్షన్ వంటి ఇతర లాభాలను పొందేందుకు ఏకంగా మహిళగా మారినట్లు పేర్కొన్నాడు. అయితే ఇది కేవలం కాగితాల మీదే కావడం గమనార్హం. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎలాంటి లాభాలు పొందాడు అనేది చూద్దాం.
స్విట్జర్లాండ్లో 2022 జనవరి ఒకటిన ఓ చట్టం అమలులోకి వచ్చింది. ఆ దేశ పౌరులు ఎవరైనా ప్రభుత్వ రికార్డుల్లో లింగాన్ని మార్చుకోవచ్చు. ఇందుకు కేవలం 81.50 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాకుండా వారి పేరును కూడా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే ఇందుకు సంబంధించి వైద్యుల నుంచి లింగ మార్పిడి జరిగినట్లుగా ఎటువంటి పత్రాలు సమర్పించాల్సి అవసరం లేదు. వారికి ఇతరత్రా పరీక్షలు కూడా ఏం ఉండవు. వారు పూర్తిగా మారారు అని భావిస్తారు.