భారత్తో పాటు వివిధ దేశాలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాల సరఫరాలో ఉన్న ఇబ్బందులను తొలగించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. దీనివల్ల టీకాల ఉత్పత్తి వేగవంతమవుతుందని.. ఫలితంగా సొంత అవసరాలతో పాటు.. ఆఫ్రికన్ దేశాలకు సహాయం అందించేందుకు వీలు పడుతుందని అభిప్రాయపడ్డారు. జి-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేముందు పారిస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాక్సిన్ల పేటెంట్ హక్కులను తాత్కాలికంగా తొలగించాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు మద్దతు తెలిపారు మేక్రాన్. జి-7 సదస్సులో ఫ్రాన్స్ ఈ అంశాన్ని లేవనెత్తుతుందని పేర్కొన్నారు.