మహమ్మారుల బామ్మ... కరోనా వద్దమ్మా..! ఆమె పేరు లూయిసా జప్పిటెల్లీ. వయసు 109ఏళ్లు. కరోనా మహమ్మారి లాగే ప్రపంచం మొత్తాన్ని వణికించిన స్పానిష్, ఆసియా ఫ్లూ, టైఫాయిడ్ వంటి రోగాల బారినపడ్డారు. పోరాడి వాటి నుంచి బయటపడ్డారు. కానీ కొవిడ్ లాంటి భయంకర వ్యాధిని తానెప్పుడూ చూడలేదని అంటున్నారు ఆమె. తన జీవిత కాలంలో ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంటికే పరిమితం కాలేదని అంటున్నారు.
"ఇన్ని రోజులుగా ఇంట్లో ఉండడం అనేది నామోషీగా భావిస్తున్నాను. ఇంటి పరిసర ప్రాంతాలను చుట్టిరావడం అనేది నా అలవాటు. తీరిక సమయంలో ఇంట్లో పనులు చేస్తాను. కానీ ఇప్పుడు కరోనాతో అంతా మారిపోయింది. బాల్కనీలో నడుస్తూ.. ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తున్నాను."
-లూయిసా జప్పిటెల్లీ, ఇటలీ.
లూయిసాకు రెండేళ్ల కిందట తొడ వెముక విరిగింది. ఇందుకు సంబంధించి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమెకు గుండెపోటు వచ్చింది. సహజంగా ఆశావహ దృక్పథంతో ఉండే ఈమె.. కరోనా విషయంలో మాత్రం దేవునిపై భారం వేశారు. లూయిసాకు 36ఏళ్ల వయసు ఉన్నప్పడు భర్త దూరం అయ్యారు. అప్పటి నుంచి పిల్లలు, మనవరాళ్లుతో గడుపుతు.. తీరిక సమయాల్లో పక్షులను పెంచడం వ్యాపకంగా మార్చుకున్నారు.
అయితే.. మొదటి దశలో కరోనా కారణంగా ఇటలీలో లాక్డౌన్ విధించారు. ఈ కారణంగా తనకెంతో ఇష్టమైన కవిత్వం, సంగీతాన్ని ఇన్ని రోజులు వదులుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నారు లుయిసా. తిరిగి సాధారణ జీవనం గడపడానికి టీకా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
"నేనేమీ ఫిర్యాదు చేయటం లేదు. ఈ వయసులో నాకు ఆ అవకాశం ఉందని అనుకోవడం లేదు. ఎప్పటి లాగే ఈ సారి బయటపడతాను అనే నమ్మకం లేదు. వైద్యుడిని నాకు సరిపోయే ఔషధం ఇవ్వమని అడిగాను. అయన చాలా తక్కువ మొత్తంలో మందులు ఇచ్చారు. టీకా ఇవ్వలేను అని చెప్పారు. ఎందుకు నేను చనిపోవాలా? అని అడిగాను. ఆయన నవ్వారు."
- లూయిసా జప్పిటెల్లీ, ఇటలీ.
లూయిసా జప్పిటెల్లీ ఒకానొక సమయంలో ఇటలీలోని ప్రముఖుల జాబితాలో భాగమయ్యారు. ఇటీవల ఓ ప్రసంగంలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటారెల్లా.. పౌరుల నిబద్ధతకు ఉదాహరణగా ఆమె పేరును ప్రస్తావించారు. మహమ్మారి తీవ్రరూపం దాల్చిన సమయంలో రాజ్యాంగ సవరణకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు వేయడానికి ముందుకు వచ్చిన ఆమె తెగువను ప్రశంసించారు.
"ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఇందులో అందరికీ సమానావకాశాలు ఉంటాయి. ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ముందుకు వచ్చి ఓటు వేసిన లూయిసా జప్పిటెల్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 72ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ వస్తున్నారు. ఆమె ఒక అలసిపోని ఓటరు. నిబద్ధతకు లూయిసా ఓ చక్కటి ఉదాహరణ."
-సెర్గియో మాటారెల్లా, ఇటలీ అధ్యక్షుడు
ప్రతి ఏడాది లాగే ఈసారీ క్రిస్మస్ జరుపుకోవాలి అనుకున్నారు లూయిసా. కానీ అక్కడి ప్రభుత్వం విధించిన కొవిడ్ ఆంక్షల కారణంగా ఈ సంవత్సరం భిన్నంగా ఉండబోతుందని అంటున్నారు. ఈ కరోనా మహమ్మారి నుంచి తిరిగి ప్రజలందరూ యథాతథస్థితికి చేరుకునే రోజు త్వరలో వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.