ఇంటర్నెట్ వినియోగం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ వాడుతున్నారు. కానీ, ఇంటర్నెట్ అతి వినియోగం చాలా ప్రమాదకరమని, ఆరోగ్య సమస్యలతోపాటు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, ఒంటరితనాన్ని అనుభవించే కౌమారదశ పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కౌమారదశ పిల్లలు.. ముఖ్యంగా పదహారేళ్ల వయసున్నవారు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కౌమార దశ పిల్లలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. బయట తిరగాలి, స్నేహితులతో ఆడుకోవాలి, ముచ్చటించాలి వంటి అనేక కోరికలు ఉంటాయి. కానీ, ఇటీవల కరోనా కాలంలో కాలేజీలు లేకపోవడం.. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాల్సి రావడంతో వారిలో ఒంటరితనం విపరీతంగా పెరిగిందట. దాన్ని దూరం చేసుకోవడం కోసం ఇంటర్నెట్‌ను అతిగా వాడటం మొదలుపెట్టారని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ పరిశోధకులు వెల్లడించారు.