లండన్లోని పార్లమెంటు స్క్వేర్లోని ప్రముఖుల స్మారకాల్లో ఒకటైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని బోర్డులతో కప్పేశారు. అఫ్రికన్- అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల నేపథ్యంలో విగ్రహాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం.
పార్లమెంటు స్క్వేర్లోని గాంధీ, బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ విగ్రహాల సమీపంలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. రంగులు పూసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవటం వల్ల ఘర్షణ చెలరేగింది.
వారి విగ్రహాలతో పాటు..
ఈ వారాంతంలోనూ జాత్యంహకార వ్యతిరేక బృందాలు, మితవాద సంఘాలు నిరసనలకు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితులు ఘర్షణలకు దారితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విగ్రహాల సంరక్షణకు లండన్ పరిపాలన విభాగం సిద్ధమయింది.
"సెనోటాఫ్, విన్స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా విగ్రహాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే వీటిని బోర్డులతో కప్పేశాం. వీటిల్లో మహాత్మాగాంధీ విగ్రహం కూడా ఉంది."
- సాదిక్ ఖాన్, లండన్ మేయర్