Bill Board Marriage advertisement: మునివేళ్లపై ప్రపంచం.. కుప్పలుతెప్పలుగా సామాజిక మాధ్యమాలు.. లెక్కలేనన్ని డేటింగ్ యాప్‌లు.. ఇలాంటి కాలంలో జీవిస్తున్న ఓ వ్యక్తి.. తన జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు బిల్‌బోర్డ్‌లను ఆశ్రయించాడు. 'నాకు సరిజోడి చూసిపెట్టండి' అంటూ ప్రకటనలు ఇచ్చాడు. 'అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి కాపాడండి' అంటూ పెద్ద అక్షరాలతో ఉన్న హోర్డింగ్‌ను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
బర్మింగ్హమ్లో బిల్బోర్డ్ Finding wife Bill Board Ad
బ్రిటన్‌లో ఉంటున్న పాకిస్థాన్ జాతీయుడు మహమ్మద్ మాలిక్.. లండన్, బర్మింగ్హమ్ నగరాల్లో ఈ బిల్బోర్డ్ ప్రకటన ఇచ్చాడు. తొలుత ఇదేదో ప్రాంక్ అయి ఉంటుందని అంతా భావించారు. లేదా సాధారణ ప్రకటనే అనుకున్నారు. కానీ తన వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలియజేశాడు మాలిక్. 'ఇది జోక్ కాదండోయ్' అంటూ వెబ్సైట్లో క్యాప్షన్ కూడా తగిలించాడు.
"ఇప్పటివరకు నాకు సరైన మహిళ దొరకలేదు. కాబోయే భార్యను వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంది. చాలా డేటింగ్ యాప్‌లను ప్రయత్నించాను. తెలిసిన వారి ద్వారా సంబంధాలు కూడా చూశాం. కానీ ఇవేవీ వర్కౌట్ కాలేదు. చివరకు నా స్నేహితుడి సలహాతో బిల్బోర్డ్ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది."
-మహమ్మద్ మాలిక్
Find Malik Wife website
దీంతో పాటు తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాలను వివరించాడు మాలిక్. 20 ఏళ్లు పైబడిన ముస్లిం మహిళ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు. తనది పెద్ద పంజాబీ కుటుంబమని, వధువు.. వారందరితో కలిసిపోయేలా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాడు.
తన తల్లిదండ్రులకు మాలిక్ ఒక్కడే సంతానమట. పేరెంట్స్ బాగోగులు తానే చూసుకోవాలని కూడా వెబ్సైట్లో పేర్కొన్నాడు. అరేంజ్డ్ మ్యారేజ్‌కు విరుద్ధంగా బిల్‌బోర్డులో ప్రకటన ఇచ్చినప్పటికీ.. పెద్దలు కుదిర్చిన పెళ్లి పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పుకొచ్చాడు మాలిక్.
ఈ ఐడియా మాలిక్‌కు వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. వందలాది మంది యువతులు ఇష్టపూర్వకంగా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నారని మాలిక్ వెల్లడించారు. వీటన్నింటినీ పరిశీలించే సమయం దొరకడం లేదని చెబుతున్నాడు.
వైరల్.. వైరల్..
మరోవైపు, ఈ బిల్బోర్డ్ ప్రకటన విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్ చేస్తూ నెటిజన్లు ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారు. ఇంటర్నెట్ డేటింగ్లో ఇది ఫైనల్ లెవెల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. త్వరలోనే అతడికి జీవిత భాగస్వామి దొరుకుతుందని కొందరు ధీమాగా చెబుతున్నారు.
ఇదీ చదవండి:కుమారుడిని కారు డిక్కీలో బంధించిన తల్లి- కొవిడ్ సోకిందని..