తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2020, 3:39 PM IST

Updated : Oct 31, 2020, 4:21 PM IST

ETV Bharat / international

పారిస్​లో 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​

కరోనా విజృంభణతో విధించిన లాక్​డౌన్​ కారణంగా పారిస్​లో 700 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేల సంఖ్యలో వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకు రావడం వల్ల వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం వల్ల అవి వైరల్​ అవుతున్నాయి.

Lockown-effect-700-km-traffic-jam-in-paris
పారిస్​లో 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో గురువారం రాత్రి ఎటు చూసినా కార్ల లైట్లే.. ఎక్కడ విన్నా హారన్ల మోతే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పారిస్‌ చుట్టూ 700 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభించడంతో అక్కడ మరోసారి లాక్‌డౌన్‌ విధించడమే ఇందుకు కారణం.

శుక్రవారం నుంచి ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో గురువారం సాయంత్రం నుంచే దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించే ప్రజలు తమ స్వస్థలాలు బయల్దేరారు. ఇంకేముంది నగరాల వెలుపలకు దారితీసే రహదారులన్నీ కార్లు, వాహనాలతో కిటకిటలాడాయి. వేల సంఖ్యలో వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గురువారం రాత్రి పారిస్‌ నగరం చుట్టూ దాదాపు 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయినట్లు ఫ్రాన్స్‌ స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ ఏడాది మార్చిలోనూ పారిస్‌లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఫ్రాన్స్‌లో తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో పారిస్‌ నుంచి దాదాపు 12లక్షల మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. నగర జనాభాలో దాదాపు ఐదో వంతు ఖాళీ అయ్యింది. అప్పుడు కూడా ఇలాగే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. నెలక్రితం వరకు ఫ్రాన్స్‌లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లే కన్పించినా.. గత కొన్ని రోజులుగా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఒక్కరోజే 47వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆందోళనకు గురైన ఆ దేశం మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. రోజుకు ఒక గంట వ్యాయామం, వైద్య సహాయం, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే ప్రజలు బయటకు వెళ్లేందుకు అనుమతి కల్పించింది. అటు లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాలను నిల్వ చేసుకునేందుకు ప్రజలు ప్రయత్నించంతో ఆ దుకాణాల్లో రద్దీ పెరిగింది.

Last Updated : Oct 31, 2020, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details