తెలంగాణ

telangana

ETV Bharat / international

3 దశల్లో లాక్​డౌన్​ ఆంక్షల ఎత్తివేతకు పక్కా ప్రణాళిక! - britain lockdown relax restrictions

మూడు దశల్లో లాక్​డౌన్​ ఆంక్షల ఎత్తివేతకు ప్రణాళికలు సిద్ధం చేసింది బ్రిటన్​ ప్రభుత్వం. అయితే, మళ్లీ కరోనా విజృంభించకుండా ఆచితూచి అడుగులేస్తోంది. కట్టుదిట్టమైన నిబంధనలతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.

LOCDOWN RELAXATION IN BRITAN
కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్​డౌన్​ ఎత్తివేసిన ప్రభుత్వం!

By

Published : May 14, 2020, 7:03 AM IST

లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాత ప్రజలు రద్దీ ప్రదేశాల్లోకి వస్తే మాస్కులను తప్పనిసరిగా ధరించాలని బ్రిటన్‌ ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థలో, షాపింగ్‌ మాల్స్‌ వంటిచోట్ల ఈ నిబంధన కచ్చితంగా పాటించాలి. వస్త్రంతో తయారైన వాటిని ధరించినా చాలు.

ఇంట్లో ఉండలేకపోతే ఆఫీస్‌కు రండి

ఇంటి వద్ద ఉండి ఉద్యోగం చేయలేనివారు అవకాశముంటే కార్యాలయానికి వెళ్లవచ్చు. ముఖ్యంగా ఉత్పాదక, నిర్మాణ, తయారీ, రవాణా, పంపిణీ, పరిశోధన రంగాల వారు కార్యాలయాలకు వెళ్లాలి. కార్యాలయాల్లోని తలుపుల పిడిలు, లిఫ్ట్‌లో బటన్లు, వంటశాలలు, టీపాయింట్లను, బాత్రూమ్‌లను తరచూ పరిశుభ్రం చేస్తుండాలి. ఈ బాధ్యత యాజమాన్యాలదే.

విద్యారంగం

కరోనా రెండోసారి విరుచుకుపడే ముప్పు ఉండటంతో పూర్తిస్థాయిలో పాఠశాలలను తెరవడం లేదు. ప్రస్తుతం కీలకమైన విధుల్లో ఉన్న 2% మంది ఉద్యోగుల పిల్లలను పాఠశాలలకు అనుమతినిచ్చింది. ఎందుకంటే అక్కడ పిల్లలకు సెలవులుంటే వారికి రక్షణగా ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. ఛైల్డ్‌కేర్‌ సెంటర్లకూ కొన్ని సడలింపులు ఇచ్చింది. డిజిటల్‌ విధానంలో బోధనకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. రెండో దశలో నర్సరీ, ప్రాథమిక పాఠశాలలను సైతం అప్పటి నుంచి అనుమతిస్తారు.

భౌతిక దూరం

ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండు మీటర్ల భౌతికదూరాన్ని పాటించాలి. ఎవరైనా ఇంటి బయటకు వచ్చాక ఒకరిని మాత్రమే కలిసేందుకు అనుమతి ఉంది. అది మిత్రుడైనా, బంధువైనా కావచ్చు.

రవాణా రంగం

వీలైనంత వరకు ప్రజారవాణాపై ఆధారపడొద్దు. సైకిళ్లు, సొంత కార్లలో ఆఫీసులకు రావాలి. సైకిళ్లకు ప్రత్యేకంగా మార్గాలను తెరిచేందుకు ప్రభుత్వం ఇప్పటికే 200 కోట్ల పౌండ్లను కేటాయించింది. రైళ్లలో ఒకేసారి ఎక్కువ మంది ఎక్కకుండా పని సమయాల్లో మార్పులను సూచించింది.

బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చు... కానీ...

వాహనాలను సొంతంగా నడుపుతూ.. భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ ఇంటి నుంచి ఎంత దూరమైనా వెళ్లవచ్చు. కాకపోతే స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌లోకి అనుమతి లేదు. ఉత్తర ఐర్లాండ్‌లో లాక్‌డౌన్‌ నుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉంది.

వైరస్‌ నుంచి బలహీనులకు రక్షణ

పిల్లలు, వృద్ధులు, అవయవ మార్పిడి జరిగిన వారు, కీమోథెరపీ చికిత్స తీసుకొంటున్న వారికి కరోనా వైరస్‌ ప్రాణాంతకం కావడంతో వారిని రక్షించేందుకు బ్రిటన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటోంది. వృద్ధులుండే కేర్‌ హోమ్స్‌లో ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించనుంది. శుక్రవారం నుంచి ప్రతి కేర్‌హోమ్‌కు ఒక వైద్యుడు అందుబాటులో ఉంటారు.

ఆదర్శంగా నిలవనున్న పార్లమెంట్‌

పని ప్రదేశాల నిర్వహణకు ఓ నిలువెత్తు ఉదాహరణగా తమ పార్లమెంట్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో వీలైనన్ని ఎక్కువ సెషన్లతో పని చేయాలని నిర్ణయించింది. కచ్చితమైన భౌతిక దూరం పాటిస్తూ... సభ్యులంతా హాజరుకానున్నారు. ఇటీవలి సమావేశాలప్పుడు 50 మంది సభ్యులను మాత్రమే ఛాంబర్లలోకి అనుమతించారు. మిగిలినవారు మంత్రులను వీడియో కాలింగ్‌తో ప్రశ్నలు అడిగారు.

క్వారంటైన్‌ విధానం

అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చేవారు తమ వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి. వారు ఎన్‌హెచ్‌ఎస్‌ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వారు ఎక్కడ స్వీయ నిర్బంధంలో ఉంటారో ప్రభుత్వానికి వెల్లడించలేకపోతే... ప్రభుత్వం సమకూర్చిన చోటే ఉండాల్సి ఉంటుంది.

పబ్‌లు, రెస్టారెంట్లు

మూడో దశలో భాగంగా జులై 4నుంచి అన్నిరకాల వ్యాపారాలకు అవకాశమిస్తారు. అప్పుడు సెలూన్‌లు, ప్రార్థనా మందిరాలతోపాటు పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, రిటైల్‌ దుకాణాలు తెరుస్తారు. అది కూడా కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించే నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే అనుమతులిస్తారు.వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి

దుస్తులపై వైరస్‌ ఎక్కువసేపే ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దాంతో... ‘‘ఉద్యోగానికి, షాపింగ్‌లకు వెళ్లే సమయంలో వ్యక్తిగతంగా శానిటైజర్‌ను తీసుకెళ్లాలి. ఇంటి బయట శానిటైజర్‌ను అందుబాటులో పెట్టుకోవాలి. దుస్తులను ప్రతిరోజూ కచ్చితంగా ఉతుక్కోవాలి’’ అని ప్రభుత్వం పేర్కొంది.

క్రీడలు, వ్యాయామం

ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి వ్యాయామం కీలకం. ఈ విషయానికి బ్రిటన్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం చేసుకోవడానికి రోజులో ఎన్నిసార్లైనా బయటకు వెళ్లవచ్చు. మైదానాలు, వ్యాయామశాలలకు మాత్రం అనుమతి లేదు. కుటుంబ సభ్యులతో కలిసి గోల్ఫ్‌, టెన్నిస్‌ వంటివి ఆడుకోవచ్చు. రెండో దశ(జూన్‌)లో ప్రేక్షకులు లేకుండా కేవలం క్రీడాకారులతో పోటీలు నిర్వహించి, వాటిని ప్రసారం చేసుకోవచ్చు. అయితే... జులై1 వరకు ఇంగ్లాండ్‌లో ఎటువంటి క్రికెట్‌ పోటీలు ఉండవని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డ్‌ వెల్లడించింది.

లాక్‌డౌన్‌లు మొదలై రెండు నెలలు కావస్తోంది. కొవిడ్‌కు సరైన చికిత్స లభించేందుకు మరింత కాలం పట్టేలా ఉంది. మరోవైపు వైరస్‌ కంటే ముందు... ఆకలే తమ ప్రాణాలను తీసేట్లుందని వివిధ దేశాల్లో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. భారత్‌ కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించేందుకు క్రమంగా అడుగులు వేస్తోంది. భారీ ఆర్థిక ఉద్దీపన ప్రకటించిన ప్రధాని మోదీ... ఈనెల 18న కొత్త నిబంధనలతో లాక్‌డౌన్‌ ఎత్తివేత విధి విధానాలను వెల్లడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో మనకంటే 48 గంటల ముందు లాక్‌డౌన్‌ ప్రకటించిన బ్రిటన్‌... దాన్ని ఎత్తివేత దిశగా బుధవారం తొలి అడుగేసింది. ఒకరకంగా ఇది సాహసమే. అయితే... ప్రజలను రక్షించుకుంటూనే ఆర్థిక వ్యవస్థను పట్టాలు ఎక్కించడానికి మూడు విడతల ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. అందులో 14 రకాల పథకాలను చేర్చింది. మే 13 నుంచి తొలిదశ, జూన్‌ 1 నుంచి మలిదశ, అన్నీ సాఫీగా సాగితే జులై 4 నుంచి చివరి దశ మొదలవుతుంది. అయితే.. తొలి దశ లాక్‌డౌన్‌ ఎత్తివేత స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌లలో అమలు కావడంలేదు. లాక్‌డౌన్‌ తర్వాత జీవితం సాధారణ స్థితిలో ఉండబోదని సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సనే అభిప్రాయపడ్డారు. త్వరలో లాక్‌డౌన్‌ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న మనకు... బ్రిటన్‌లో ఎలాంటి నిబంధనలు విధించారు? వేటికి అనుమతి ఇచ్చారు? పాటించనున్న విధానాలు ఏమిటి? మొదటి రోజు ఎలా సాగిందనేది ఆసక్తికరమే.

తొలి రోజు సాగిందిలా..!

ఇంగ్లాండ్‌లో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షల ఎత్తివేత మొదలైంది. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడుతూ ‘‘వైరస్‌ మరోసారి తీవ్రంగా దాడిచేస్తే మనం నియంత్రించలేకపోవచ్చు. అప్పుడు వేలమంది ప్రాణాలు కోల్పోతారు. మళ్లీ నిబంధనలు విధించాల్సి వస్తుంది. మనం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది’’ అని అన్నారు. అయితే... ‘‘స్కాట్లాండ్‌ ప్రజలు ఈ స్థితిలో పనులకు వెళ్లడాన్ని ప్రోత్సహించం. యుకే ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఇప్పుడు స్కాట్లాండ్‌లో అమలు చేయడంలేదు’’ అని స్కాట్లాండ్‌ ఫస్ట్‌ మినిస్టర్‌ నికోల్‌ స్టర్జన్‌ ప్రకటించారు. మరోవైపు లండన్‌లోని భూగర్భ రైల్వేల్లో బుధవారం ఒక్కరోజే 2,30,000 మంది ప్రయాణించి ఉంటారని అంచనా. కొందరు ప్రయాణికులు భౌతిక దూరం పాటించకపోవటం, మాస్కులు ధరించకపోవడం వంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

ఇదీ చదవండి:కరోనా సహజంగా రాలేదు.. ల్యాబ్​లోనే తయారైంది: గడ్కరీ

ABOUT THE AUTHOR

...view details